హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 30(నమస్తే తెలంగాణ): మూసీ బ్యూటిఫికేషన్ అంచనా వ్యయాన్ని మూడు నెలల్లో లక్ష కోట్లకు పెంచిన సీఎం రేవంత్‌రెడ్డిపై ఓ సాధారణ మహిళ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి. రెండు నెలలుగా తనకు పెన్షన్ డబ్బులు విడుదల కాకపోవడంతో అసహనంతో ఆమె తన గోడు వెళ్ల్లబోసుకున్నది. మంగళవారం బేగంపేటలోని ప్రజాభవన్‌లో జరిగిన ‘ప్రజావాణి’లో తన ఇబ్బందులు చెప్పుకున్న క్రమంలో ఆవేదన వ్యక్తం చేసింది. అదే సమయంలో ఓ యూట్యూబ్ చానల్ ప్రతినిధి ప్రజాపాలనపై ఆమె అభిప్రాయం కోరాడు.
హైదరాబాద్ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన కోసం సీఎం రేవంత్‌రెడ్డి వేల కోట్ల నిధులు వెచ్చిస్తున్నారు కదా.. అని చెప్పగా ఆమె స్పందించింది. ‘సంచులు నింపుకోవద్దా? ఉట్టిగనే మందికి వేస్తాడా? ఆయన బాగుపడొద్దా? ఏం చేసైనా పేదోళ్లను ఆదుకోవాలి. మంచి పనులు కూడా చేయాలి. ఎనిమిది నెలలైంది. ఏ పనీ చేయలేదు. బస్సు ఒకటి ఫ్రీ ఇచ్చిండు. రెండు నెలలుగా పెన్షన్లు లేవు. ఆంధ్రాలో మొన్ననే ఎక్కిండు. రూ. 7వేలకు పెన్షన్ పెంచి ఇచ్చిండు. వాళ్లని చూసైనా సిగ్గు రావాలి కదా. రూ. 4 వేలు కాదు, పాత రూ. 2 వేలు అయినా రాలేదు. ఈ హైదరాబాద్ బాగుపడదా?’ అని ఆమె తన అసహనం వ్యక్తం చేసింది.