
బంజారాహిల్స్, డిసెంబర్ 7: ఇంటర్నెట్ కనెక్షన్ సరిచేసేందుకు వచ్చి ఓ మహిళ స్నానం చేస్తున్న వీడియోను చిత్రీకరించిన యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ మల్లేపల్లిలోని ఇందిరానగర్‌కు చెందిన కే మార్టిన్ (19) బంజారాహిల్స్‌లోని యాక్ట్ ఫైబర్ నెట్ సంస్థలో టెక్నీషియన్. బంజారాహిల్స్ రోడ్డునంబర్ 2లోని ఓ అపార్ట్మెంట్లో ఇంటర్నెట్ సరిగా పనిచేయడం లేదని ఫిర్యాదు రావడంతో మంగళవారం మధ్యాహ్నం మార్టిన్ అక్కడకు వెళ్లాడు.
రోడ్డుమీద ఉన్న స్తంభానికి నిచ్చెన పెట్టి కేబుల్స్ పరిశీలిస్తున్న మార్టిన్ పక్కనే ఉన్న ఇంట్లో ఓ మహిళ (45)బాత్రూమ్లో స్నానం చేస్తున్న విషయాన్ని గమనించాడు. తన సెల్‌ఫోన్‌తో రికార్డింగ్ ప్రారంభించాడు. ఈ విషయాన్ని గమనించిన మహిళ అప్రమత్తమై ఇంట్లోనే ఉన్న భర్తకు చెప్పింది. ఆయన స్థానికుల సాయంతో మార్టిన్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు.