(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): గడిచిన తొమ్మిదేండ్లలో వంటగ్యాస్ సిలిండర్ ధరను దాదాపు మూడు రెట్లు పెంచిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పేద మధ్యతరగతి జీవుల నడ్డివిరిచింది. బడ్జెట్ కేటాయింపుల్లో ఎల్పీజీపై ఇస్తున్న సబ్సిడీ మొత్తాన్ని ఇప్పటికే ఎత్తేసిన కేంద్రం.. తాజాగా గృహావసరాలకు వినియోగించే 14 కిలోల వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.50 వడ్డించింది. దీంతో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,155కు ఎగబాకింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండర్ ధరను రూ. 350.50 పెంచగా, దాని ధర రూ. 2,119.50కు చేరింది. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో కుదేలవుతున్న సామాన్యులకు గ్యాస్ ధర పెంపు మరో భారంగా మారింది. దీంతో ప్రజలు మళ్లీ కట్టెల పొయ్యి వైపునకు మళ్లుతున్నారు.
ఉజ్వల యోజన ఉత్తిదే..
అసలే గ్యాస్ ధర పెరిగిపోవడం, ఉజ్వల యోజన కింద కేంద్రం ఇస్తామన్న రూ.200 సబ్సిడీ సమయానికి బ్యాంక్ ఖాతాల్లో జమకాకపోవడంతో సిలిండర్ ‘రీఫిల్లింగ్’ బుకింగ్స్ భారీ స్థాయిలో పడిపోయాయి. దేశవ్యాప్తంగా ఉన్న 9.6 కోట్ల ఉజ్వల కనెక్షన్లలో సిలిండర్ రీఫిల్ బుక్ చేస్తున్నవారు కొద్దిమంది మాత్రమే ఉండటం గమనార్హం. మొత్తం ఉజ్వ ల లబ్ధిదారుల్లో నాలుగు అంతకన్నా తక్కువ సంఖ్యలో రీఫిల్ బుక్ చేసినవారు 56.5 శాతం కాగా, ఒక్కసారి మాత్రమే రీఫిల్ కొనుగోలు చేసినవారు 11.3 శాతం మాత్రమే. 9.6 శాతం మంది అసలు రీఫిల్లింగ్ చేసుకోకుండా కట్టెల పొయ్యి మీద వంట చేసుకొంటున్నారు.
మాది ఉమ్మడి కుటుంబం. ఇంట్లో మొత్తం ఎనిమిది మంది ఉంటాం. ఉదయం, సాయంత్రం అందరికీ రొట్టెలు చేయాలి. గ్యాస్ సిలిండర్ ధర చూస్తే ఆకాశాన్నంటుతున్నది. కూలి పనులు చేసే మాలాంటోళ్లకు సిలిండర్ కోసం వెయ్యి పెట్టే స్థోమత ఎక్కడిది? అందుకే, పిడకలు, కట్టెలు ఏరుకొచ్చి పొయ్యి మీద రొట్టెలు చేస్తున్న.
– కౌసల్యా బెన్, అరంద్ ఖేడా గ్రామం, కోటా, రాజస్థాన్