ముషీరాబాద్/బన్సీలాల్‌పేట, నమస్తే తెలంగాణ (డిసెంబర్ 24) : పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న మరో యు వతి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ఇన్నాళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టిన కామారెడ్డి జిల్లాకు చెందిన సురేఖనాయక్ తాను ఉంటున్న హాస్టల్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. వ్యక్తిగత కారణాలా? లేక పోటీ పరీక్షల ఒత్తిడిని భరించలేక బలవన్మరణానికి పాల్పడిందా? అనే కో ణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. చిక్కడపల్లి పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం అవులకుంట తండాకు చెందిన సురేఖనాయక్(24) అశోక్‌నగర్‌లోని ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ గ్రూప్-2, రైల్వే ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నది. సోమవారం తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్నేహితురాలు హాస్టల్ నిర్వాహకులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే వచ్చి కిందకు దింపారు. కొన ఊపిరితో ఉన్న ఆమె ను గాంధీ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. పోస్టుమార్టం చేసిన అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆ వెంటనే మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. కాగా సురేఖకు ఇటీవలే నిశ్చితార్థం జరిగిందని, వచ్చే నెల 7న వివాహం నిర్ణయించినట్టు సమాచారం. తల్లిదండ్రులు కుదిర్చిన వివాహం ఇష్టం లేకనా? లేదా మరేదైనా కారణం ఉన్నదా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ మేరకు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.
సురేఖ ఆత్మహత్యపై ఆందోళన వ్యక్తంచేస్తూ పలువురు విద్యార్థులు, ఎస్టీ సంఘాల నాయకులు గాంధీ దవాఖానకు చేరుకున్నారు. సురేఖ మృతిపై విచారం వ్యక్తంచేశారు. సిట్టిం గ్ జడ్జితో విచారణ జరిపించాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్‌నాయక్ డిమాండ్ చేశారు. సురేఖ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేయాలని ప్రకటనలో కోరారు. గాంధీ దవాఖాన వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చిలకలగూడ, చిక్కడపల్లి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
రెండు వారాలుగా పుష్ప-2 వివాదం నడుస్తుండటంతో పోలీసులు ఇతర అంశాలపై దృష్టి పెట్టడం లేదు. చిక్కడపల్లి పీఎస్ పరిధిలోనే ఈ రెండు ఘటనలు జరిగాయి. అల్లు అర్జున్ విచారణ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు రెండు రోజులు అదే హడావుడిలో పడిపోయారు. సోమవారం ఆత్మహత్యకు పాల్పడితే, విచారణ చేపట్టలేదనే విమర్శలు ఉన్నా యి. పోస్టుమార్టం హడావుడిగా చేసి సొంతూరికి మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు ఒత్తిడి చేశారని తల్లిదండ్రులు వాపోయారు.
గాంధారి, డిసెంబర్ 24: అవులకుంట తండాకు చెందిన గుగ్లోత్ బావుసింగ్, లాడుబాయి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సురేఖ రెండో కుమార్తె. చిన్నప్పటి నుంచే చదువులో ముందుండేది. కామారెడ్డి లో డిగ్రీ, ఓయూలో పీజీ పూర్తిచేసిన ఆమె.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నది. సంవత్సర కాలంగా అశోక్‌నగర్‌లోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ గ్రూప్-2 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నది. ఉన్నతోద్యోగం సాధించి తండా పేరు నిలబెడుతుందనుకున్న యువతి ఇలా అకస్మాత్తుగా మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు నెలకొన్నాయి.
సికింద్రాబాద్, డిసెంబర్ 24: సురేఖనాయక్ కుటుంబసభ్యులను ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఎస్టీసెల్, లంబాడ హక్కుల పరిరక్షణ నాయకులు పరామర్శించారు. విషయం తెలియగానే జాజాల సురేందర్ తదితరులు మంగళవారం గాంధీ దవాఖానకు వెళ్లి కుటుంబసభ్యులను ఓదార్చారు. పోలీసులతో మాట్లాడి ఆత్మహత్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాని కి అండగా ఉంటామని హామీ ఇచ్చా రు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఉజ్వల భవిష్యత్ కలిగిన సురేఖ మరణం బాధాకరమని పేర్కొన్నారు. పోలీసులు ఆమె మృతికి గల కారణాలను చెప్పడం లేదన్నారు.