హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఫోర్జరీ, నిధుల దుర్వినియోగం వంటి నేరాలకు పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న టీవీ-9 మాజీ డైరెక్టర్ రవిప్రకాశ్‌పై క్రిమినల్ కేసు ఉపసంహరణకు ప్రభుత్వం గత నెల 15న జీవో జారీ చేయడం, దాని ఆధారంగా కూకట్పల్లి మేజిస్ట్రేట్ కోర్టు ఉపసంహరణ ఉత్తర్వులు జారీ చేయడం చట్టవిరుద్ధమని అలాందా మీడియా ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ హైకోర్టుకు తెలిపింది.
ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆ సంస్థ డైరెక్టర్ కౌశిక్‌రావు వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఈవీ వేణుగోపాల్ సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది టీ నిరంజన్‌రెడ్డి వాదిస్తూ.. ఎలాంటి కారణాలను పేర్కొనకుండా ఈ కేసు ఉపసంహరణకు మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీచేశారని, ఇది నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని చెప్పారు.
యాంత్రికంగా జారీచేసిన ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, రవిప్రకాశ్‌కు, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 5కి వాయిదా వేసింది.