హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ): విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ఉన్నత చదువులు చదవడానికి భారత విద్యార్థులు విదేశాలకు పరుగులు తీస్తున్నారు. అయితే సర్టిఫికెట్ల విషయంలో (విద్యార్హత, మ్యారిటల్ స్టేటస్ తదితర సర్టిఫికెట్లు) విదేశీ యూనివర్సిటీలు రకరకాల నిబంధనలను అమలు చేస్తున్నాయి.
దీంతో మన సర్టిఫికెట్లు నిజమైనవేనని నిర్ధారిస్తూ హెడ్ ఆఫ్ బ్రాంచ్ సెక్రటేరియెట్ అధికారి ఆమోద్ర ముద్ర వేస్తే ఇక మనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. అయితే ఈ ఆమోద ముద్ర పొందాలంటే తొలుత మీసేవలో దరఖాస్తు చేసుకుని జీఏడీ(జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్) అటెస్టేషన్ డాక్యుమెంట్‌ను ఫిల్ చేయాలి.
అనంతరం స్లాట్ ఆధారంగా జీఏడీ కార్యాలయానికి వెళ్లి సర్టిఫికెట్లను అందజేయాలి. వాటిని సంబంధిత రంగానికి చెందిన కార్యాలయాలకు పంపించి వాటిని నిజనిర్ధారణ చేస్తారు. అయితే ఈ ప్రక్రియ 5 ఏజెన్సీలతో కొనసాగుతుంది. జీఏడీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయ్యాక ఏజెన్సీలు వాటిని సేకరించి తిరిగి బ్రాంచ్ సెక్రటేరియెట్ కార్యాలయానికి అందిస్తారు.
ఆ అధికారి ఆ సర్టిఫికెట్లు సరైనవేనని ఆమోద ముద్రవేసి అటెస్టేషన్ చేస్తారు. అలా జారీ అయిన సర్టిఫికెట్లు విదేశాల్లో చెల్లుబాటు అవుతాయని హెడ్ ఆఫ్ బ్రాంచ్ సెక్రటేరియెట్, హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి జొన్నలగడ్డ స్నేహజ తెలిపారు. జీఏడీలో ప్రత్యేక కౌంటర్ ఉంటుంది.
ఒక్క సర్టిఫికెట్‌కు రూ.134 ఖర్చు అవుతుంది. ఇందులో ఏజెన్సీ రూ.84, బ్రాంచ్ సెక్రటేరియెట్ రూ.50 ఛార్జీ చేస్తాయి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తవడానికి మూడు రోజుల సమయం పడుతుంది. కానీ జీఏడీలో తత్కాల్ సేవతో ఒక్క రోజులో కూడా పని అయిపోవచ్చు. ఈ ప్రక్రియలో ఏమైన సందేహాలుంటే hobs.hyderabad @mea.gov.inకు మెయిల్ చేయొచ్చని స్నేహజ తెలిపారు.