కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర( Maharastra) లోని నాందేడ్ జిల్లా భోకర్ తాలూకా పాలజ్ ( Palaj ) గ్రామంలోని ఆలయానికి విశేష చరిత్ర ఉంది. కర్ర వినాయకుడి (Stick God Vinayaka) గా కొలువు దీరే గణనాథుడిని వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చి ముడుపులు కట్టడం.. కోరికలు నేరిన తరువాత ముడుపులు విడవడం ఇక్కడి ప్రత్యేకత . సుమారు ఐదు నుంచి 10 కోట్ల ఆదాయం ఆలయానికి ప్రతి ఏటా సమకూరుతుందన్నదంటే ఈ ఆలయానికి అంత పవిత్రత ఉందని భక్తుల నమ్మకం.
భక్తుల కొంగుబంగారంగా కోరిన కోర్కెలు తీర్చే సత్య గణేషుడిగా ప్రసిద్ధికెక్కిన ఈ వినాయకుడిని 1947వ యేట ప్రస్తుత జిల్లా కేంద్రమైన నిర్మల్‌కు చెందిన కళాకారుడు గుండాజీ ఒకే పొన్కు కర్రకు చెక్కడం విశేషం. గ్రామంలో గత్తర వ్యాప్తి చెంది కుటుంబాలకు కుటుంబాలు మరణిస్తున్న సమయంలో ఆ కర్ర వినాయకుని తెచ్చి ప్రతిష్టించి పూజలు చేయడంతో గత్తర బీమారి తగ్గి గ్రామం ప్రశాంతమైనట్టు గ్రామస్థులు వివరించారు. అప్పటి నుంచి నేటి వరకు వినాయక చవితి రోజు విగ్రహాన్ని ప్రతిష్టించి అనంతరం ప్రత్యేక గదిలో తాళం వేసి ఉంచుతారు.
11 రోజులపాటు మహారాష్ట్ర, తెలంగాణ ( Telangana ) , ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) , కర్ణాటక( Karnataka) తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ కర్ర వినాయకుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ మరుగుదొడ్లు, మూత్రశాలలు, నిరంతరం అన్నదాన కార్యక్రమం, వాహనాలకు విడివిగా ప్రత్యేక పార్కింగ్‌లను ఏర్పాటు చేసింది. భక్తులు స్వామివారికి మొక్కుకొని ముడుపులు కట్టడం విశేషం. వచ్చేయేడాది కోరిన కోరికలు ఫలించిన భక్తులు తమ ముడుపులను విప్పి మొక్కులు చెల్లించుకుంటారు.
మహారాష్ట్ర, తెలంగాణ ఆర్టీసీ భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడుపుతోంది. మహారాష్ట్ర సర్కారు పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసింది. ఉత్సవాలలో ప్రతిరోజు మహారాష్ట్రకు చెందిన కీర్తనకారులు భక్తి ప్రవచనాలు చేస్తారు. సాంస్కృతిక కళ బృందాలచే ప్రతిరోజు ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు కార్యక్రమాలు నిర్వహించారు. కాలినడకన వేలాదిమంది భక్తులు నడుచుకుంటూ ఈ ఆలయానికి చేరుకుంటారు .
భక్తులకు సేవ చేసేందుకు చుట్టుపక్కల గ్రామాల వారితో మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల భక్తులు 11 రోజులు సేవలందిస్తారు. ఈనెల 6 నిమజ్జనం సందర్భంగా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అయితే నిమజ్జనం రోజున కర్ర గణపతి విగ్రహానికి భారీ ఎత్తున్న ఊరేగించి చెరువు వద్దకు తీసుకెళ్లి అక్కడ చెరువు నీటితో విగ్రహంపై చిలకరించి తిరిగి విగ్రహాన్ని తీసుకొచ్చి ఆలయంలోని గదిలో ఉంచుతారు. తిరిగి దానిని ప్రతి యేట గది నుంచి తీసి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.