ములుగురూరల్, నవంబర్ 12: ములుగు జిల్లా కేంద్రంలో బుధవారం చలి తీవ్రతతో వృద్ధురాలు మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ప్రభుత్వ భవనంలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రం వద్ద గ్యాస రాధమ్మ(65) తన కుమారుడు, మనుమడితో కలిసి జీవిస్తున్నది. సొంత ఇల్లు లేకపోవడంతో అంగన్వాడీ కేంద్రం భవన షెడ్లోనే కొన్నేళ్లుగా ఉంటున్నారు.
వారం రోజులుగా చలి తీవ్రత పెరిగిపోవడంతో మంగళవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై నిద్రలోనే మృతి చెందింది. సొంత ఇల్లు లేకపోవడంతో స్థానికులు రోడ్డు పక్కన టెంటు వేసి రాధమ్మ మృతదేహాన్ని ఉంచి తలా కొంత డబ్బులు జమ చేసి అంత్యక్రియలు పూర్తిచేశారు. మృతురాలి కుమారుడికి సొంతింటిని మంజూరు చేయడంతోపాటు మనుమడి చదువుకు ప్రభుత్వం అండగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు.