హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 162ను వక్రీకరిస్తారా?’ అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. ప్రభుత్వానికి అనుకూలంగా రాజ్యాంగ అధికరణాన్ని వక్రీకరిస్తే చూస్తూ కూర్చోబోమని స్పష్టం చేసింది. చట్టబద్ధమైన చెల్లింపులను కూడా చేయలేని స్థితిలో రాష్ట్రం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేసింది. రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించడం లేదని, భూములిచ్చిన రైతులకు పరిహారం ఇవ్వకుండా ఏండ్లకేండ్లు తిప్పించుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలు కోసం ప్రభుత్వం 2014 నుంచి జారీచేసిన ఎనిమిది జీవోలను సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్‌గోపాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఏవీ శ్రవణ్‌కుమార్ గురువారం విచారణను కొనసాగించారు.
విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. ‘ఆర్థిక చెల్లింపుల వ్యవహారాల్లో సాధారణంగా కోర్టులు జోక్యం చేసుకోవు. అయితే ప్రభుత్వం తన విధులను నిర్వహించేటప్పుడు సంక్షేమ పథకాల ప్రాధాన్యాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉద్యోగ విరమణ పొందిన వారికి ప్రయోజనాలు చెల్లించలేని ఆర్థిక దుస్థితిలో ఉన్నట్టు కోర్టులో దాఖలవుతున్న పిటిషన్లే నిదర్శనం. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోర్టులు ఆదేశించినా ఫలితం లేదు. దీనిపై దాఖలయ్యే కోర్టు ధికరణ పిటిషన్లే ఇందుకు నిదర్శనం. ఉద్యోగ విరమణ ప్రయోజనాలు చెల్లించాలని రిటైర్డ్ ఉద్యోగులు, వేతనాలు అందడం లేదంటూ కాంట్రాక్ట్ ఉద్యోగులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. పరిహారం, పెన్షన్ వంటి ప్రయోజనాల కోసం ప్రజలు కోర్టుల చుట్టూ తిరుగాల్సిన దుస్థితి నెలకొన్నది. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రలో ఆర్థికంగా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని అనిపిస్తున్నది’ అని వ్యాఖ్యానించింది. హకులకు భంగం కలిగితే ఎవరైనా కోర్టుకు వచ్చినప్పుడు రాజ్యాంగం ప్రకారం స్పందిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.
భూసేకరణ పరిహారానికి సంబంధించి ప్రస్తుతం 19 కోర్టు ధికరణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ సందర్భంగా అదనపు అడ్వొకేట్ జనరల్ మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్ స్పందించారు. వాటిలో మూడు కేసులకు టోకెన్లు జారీ చేశామని తెలిపారు. మిగిలిన కోర్టు ధికరణ కేసుల పూర్తి వివరాలను సమర్పించేందుకు గడువు కావాలని కోరారు. ప్రస్తుత కేసులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడం వల్లే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుపై స్టే విధించారని, అఫిడవిట్ దాఖలు చేసినందున స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో అధికరణ 162కు సంబంధించి తప్పుగా పేరొన్న అంశాన్ని ఎత్తిచూపారు.
దీనిపై ఖాన్ జోక్యం చేసుకుంటూ, అచ్చుతప్పులు జరిగాయని, వాటిని సరిదిద్ది అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. దీంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది సాధారణ పొరపాటుగా పరిగణించబోమని, ఇది తీవ్రమైన అంశమని తేల్చి చెప్పారు. ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలు చేస్తూ, రాజ్యాంగంలోని ఒక అధికరణకు పొంతనలేని వివరణ ఇస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో అఫిడవిట్ దాఖలు చేసేటప్పుడు సదరు అధికరణం ఉద్దేశం ఏమిటో? అదే చెప్పాలని ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లోనే రాజ్యాంగ అధికరణాన్ని వక్రీకరిస్తూ దాఖలు చేయడాన్ని తేలిగ్గా తీసుకోబోమని తేల్చి చెప్పారు. అఫిడవిట్‌ను పరిశీలించకుండా బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి సంతకం ఎలా చేస్తారని నిలదీసింది. తప్పులను సరిదిద్దితూ అఫిడవిట్ దాఖలు చేయాలని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుకు ఉన్న చట్టబద్ధత, ప్రజాధనం వినియోగంలో ప్రభుత్వ ప్రాధాన్యాలు, బడ్జెట్ కేటాయింపులు, శాసనసభ ఆమోదం తదితర అంశాలపై సమగ్ర విచారణ అవసరమని ధర్మాసనం పేరొన్నది. ప్రజల సొమ్మును సంక్షేమ పథకాలకు వెచ్చిస్తున్నారని, కానీ చట్టబద్ధంగా చెల్లించాల్సిన బకాయిలను మాత్రం చెల్లించలేని దుస్థితి ఎందుకొచ్చిందని ధర్మాసనం ప్రశ్నించింది. ‘సంక్షేమ పథకాలను మేము వ్యతిరేకించడం లేదు. అయితే అప్పుచేసి.. పప్పు కూడు అన్నట్టుగా ప్రభుత్వ విధానం ఉండకూడదు. ఉన్న కొద్దిపాటి భూమిని ప్రభుత్వానికి అప్పగించిన బాధితులకు ఏండ్ల తరబడి పరిహారం చెల్లించకుండా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. బాధిత రైతులు దాఖలు చేస్తున్న ధికరణ కేసుల్లోనూ అధికారులు నిధుల కొరతను సాకుగా చూపుతూ వాయిదాలు కోరుతున్నారు.
చివరకు ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాల వంటి చట్టబద్ధమైన బకాయిల చెల్లింపుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. మరోవైపు సంక్షేమ పథకాలకు ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తున్నారు. ఆయా పథకాల అమలుకు చట్టబద్ధమైన ఆధారం ఏమిటో ప్రభుత్వం స్పష్టంచేయాలి. కేవలం జీవోలు, ఆర్థిక శాఖ అనుమతులు సరిపోతాయా. అప్పులు చేసి పథకాలను అమలు చేయాల్సిన అవసరం రాష్ట్రానికి ఎందుకొచ్చింది’ అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రజల హకులను పరిరక్షించడంతోపాటు భవిష్యత్తు తరాల ప్రయోజనాలను కాపాడేలా ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు విశాల దృక్పథంతో ఉండాలే గానీ, అప్పు చేసి పథకాలు అమలు చేసే దుస్థితి కొనసాగకూడదని హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పథకాలపై స్టే ఎత్తివేత అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. బీసీ సంక్షేమశాఖ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులు సమగ్ర వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. విచారణను ఈ నెల 24కు వాయిదా వేశారు.