సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 02:22:28

పర్యాటకాభివృద్ధికి సైనికుడిలా పనిచేస్తా

పర్యాటకాభివృద్ధికి సైనికుడిలా పనిచేస్తా

  • టీఎస్‌టీడీసీ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా 
  • హైదరాబాద్‌లో పదవీ బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ర్టాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు సైనికుడిగా పనిచేస్తానని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా పేర్కొన్నారు. గురువారం హైదర్‌గూడలోని కార్యాలయంలో టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ గుప్తా మాట్లాడుతూ... బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఆరున్నరేండ్లుగా కృషిచేస్తున్న సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ మార్గదర్శకాలను పాటిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యాటక అభివృద్ధికి కృషిచేస్తానని చెప్పారు. యాదాద్రి, కాళేశ్వరం, వేములవాడ దేవాలయాలను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. 

పర్యాటక ప్రాంతాల్లో అవసరమైన చోట మినీ ట్యాంక్‌బండ్‌లు నిర్మించేందుకు ప్రయత్నిస్తామని ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అన్నివర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలను అమలుచేశారని తెలిపారు. అదే స్ఫూర్తితో హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి టూరిజం స్పాట్లను ఏర్పాటుచేస్తామని చెప్పారు. బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్‌ గుప్తాకు మంత్రులు వీ శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్సీలు ఫరూక్‌ అహ్మద్‌, దయానంద్‌ గుప్తా, యెగ్గె మల్లేశం తదితరులు అభినందనలు తెలిపారు.