శేరిలింగంపల్లి, జులై 9: దాడులు ప్రతిదాడులతో శేరిలింగంపల్లి మండలంలోని బసవతారక నగర్ దద్దరిల్లింది. గుడిసెలు ఖాళీ చేయాలంటూ ప్రైవేట్ వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతూ బుధవారం గుడిసెలను తొలగిస్తుండగా బాధితులు తిరగబడ్డారు. దీంతో అక్కడే ఉన్న హి జ్రాలు వారిపై దాడిచేశారు. బాధితులు ప్రతిఘటించడంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. తమపై దాడిచేసిన ఐదుగురు వ్యక్తులను పట్టుకున్న గుడిసెవాసులు వారిని చితకబాదారు. అనంతరం తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. సమాచా రం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.