హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది 10 కోట్ల రొయ్య పిల్లలను మంచినీటి వనరుల్లో విడుదల చేయాలని నిర్ణయించి రూ.28 కోట్ల నిధులు కేటాయించింది. వీటిని కూడా చేప పిల్లలను పంపిణీ చేసేటప్పుడే మత్స్యకారులకు అందజేయాలి. రెండు నెలలుగా టెండర్ల ప్రక్రియ సాగుతూనే ఉన్నది. తుది దశకు వచ్చిన సమయంలో పంచాయతీ ఎన్నికల కోడ్ రావడంతో ఎలక్షన్ కమిషన్ టెండర్లను నిలిపివేసింది.
సీజన్ ముగిసిపోతుండటంతో రొయ్యల పంపిణీ టెండర్లను వెల్లడించేందుకు అనుమతినివ్వాలని కోరుతూ ఎలక్షన్ కమిషన్కు మత్స్యశాఖ అధికారులు లేఖ రాశారు. ఎలక్షన్ కమిషన్ అనుమతివ్వగానే టెండర్లను ప్రకటించి రొయ్యల పంపిణీ మొదలుపెడతామని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ ఈ ఏడాది నిర్దేశించిన సమయంలో పూర్తయ్యే పరిస్థితి లేదు. సోమవారం నాటికి కేవలం 8,406 నీటి వనరుల్లో 32.66 కోట్ల చేప పిల్లలను విడుదల చేశారు. ఈ ఏడాది 84 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.