హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): గుండెకాయ లాంటి వర్సిటీల భూములు ఇతర సంస్థలకు అప్పగించటం మానుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆవరణలో 16 రోజులుగా విద్యార్థులు చేస్తున్న ధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.
విద్యార్థుల ఉద్యమాన్ని పెడచెవిన పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారి గొంతు నొక్కేస్తున్నదని మండిపడ్డారు. కబ్జాలో ఉన్న భూమిని సేకరించి స్వాధీన పర్చుకోవాలని, వర్సిటీ భూములను కాపాడాలని అన్నారు. మన వ్యవసాయ యూనివర్సిటీకి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్నదని, మనకు అన్నం పెట్టే వర్సిటీని కాపాడుకోవాలని న్యాయమూర్తులు సీఎంకు గుర్తుచేయాలని సూచించారు.