హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికను రద్దు చేయిస్తారా? బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తున్నదా? కేంద్ర మంత్రులు రంగంలోకి దిగి కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి తేవడం ఇందుకేనా? ఒక అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక గురించి కేంద్ర మంత్రులు అనేకమార్లు సీఈసీని కలిసి ఫిర్యాదులు చేయడంలో ఆంతర్యం ఇదేనా?.. అవుననే అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. తమ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు పనులు ఇవ్వడమే కాదు.. రూ.కోట్లను అడ్వాన్సుల రూపంలో ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ డబ్బుతో రాజగోపల్రెడ్డి మునుగోడులో కొట్లాడుతున్నారు.
అయితే, అమిత్‌షా నేతృత్వంలోని అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ కేంద్ర నిఘా వర్గాలు మునుగోడులో బీజేపీ ఓటమి ఖాయమని తేల్చాయని సమాచారం. దీంతో ఈ నెల 31న మునుగోడులో అమిత్‌షా పాల్గొనాల్సిన బహిరంగ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డాను వెళ్లమని సూచించారని, ఇదే విషయాన్ని రాష్ట్ర నేతలకు చెప్పారని తెలిసింది. అట్టర్‌ఫ్లాప్ షోకు తానేందుకు వెళ్తానని నడ్డా భీష్మించుకొని కూర్చున్నాడని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. దీంతో 31వ తేదీ మునుగోడు జేపీ నడ్డా సభ కూడా రద్దు అయ్యిందని తెలుస్తున్నది.
ఏబీఎం, కేంద్ర నిఘావర్గాలు మునుగోడులో రాజగోపాల్ ఓటమి ఖాయమని తేల్చడంతో ఉప ఎన్నికను ఎలాగైనా రద్దు చేయించాలని బీజేపీ యత్నిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఈ నెల 26న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, 28న కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఉప ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని తెలిసింది. గతంలో తమిళనాడులోని ఆర్కేనగర్ ఎన్నికను ఏవిధంగా రద్దు చేయించారో.. అదే విధంగా మునుగోడు ఉప ఎన్నికను కూడా రద్దు చేయిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలు ఎవ్వరు కూడా మునుగోడులో సీరియస్‌గా ప్రచారం చేయడంలేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటు ద్వితీయస్థాయి నాయకులు సైతం ప్రచారం నుంచి మెల్లిమెల్లిగా జారుకొంటున్నరు.