హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, నాగారం గ్రామంలో భూదాన్ భూముల్లో ఎలాంటి చర్యలూ చేపట్టరాదని తామిచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించి నిర్మాణాలు ఎలా చేపడతారని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. తమ ఉత్తర్వులకు విరుద్ధంగా ఐఏఎస్, ఐపీఎస్‌లు, వారి బంధువులు, ఇతర ప్రైవేటు వ్యక్తులు ప్రారంభించిన నిర్మాణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది.
నాగారంలోని సర్వే నంబర్ 181, 182, 194, 195లోని భూదాన భూముల్లో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదంటూ అదే మండలానికి చెందిన బీర్ల మల్లేశ్ హైకోర్టును ఆశ్రయించారు. భూదాన్ యజ్ఞ భూములను కాజేస్తున్నది ఉన్నతాధికారులు, వారి కుటుంబసభ్యులు కాబట్టి ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీలతో దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. దీనిపై గతంలో విచారణ జరిపిన హైకోర్టు, తదుపరి ఉత్తర్వులను వెలువరించే వరకు సదరు భూములను అన్యాక్రాంతం కాకుండా చూడాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
ఆ భూముల్లో ఎలాంటి లావాదేవీలు జరపడానికి వీల్లేదని, వాటిని నిషేధిత జాబితాలో చేర్చాలని ఆదేశించింది. అయితే, ఆ స్థలాలకు ప్రహరీ వంటి నిర్మాణాలు చేస్తున్నారని పేరొంటూ తాజాగా బీర్ల మల్లేశ్ కోర్టు ధికరణ పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై మంగళవారం జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి విచారణ జరిపి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీచేశారు. పిటిషనర్ అందజేసిన ఫొటోలను పరిశీలిస్తే సదరు భూమిలో నిర్మాణాలు జరుగుతున్నట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.
భూదాన్ భూములను ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబసభ్యులు చట్ట వ్యతిరేకంగా వశం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని పిటిషనర్ వాదించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఐఏఎస్ అధికారులు నవీన్‌మిట్టల్, వసుంధర సిన్హా, ఏకే మహంతి, అమోయ్‌కుమార్, రాజశ్రీ హర్ష, అజయ్‌జైన్, ఐపీఎస్ అధికారులు మహేశ్‌భగవత్, సౌమ్యామిశ్రా, స్వాతిలక్రా, రవిగుప్తా, తరుణ్‌జోషి, తోట శ్రీనివాసరావు, సుబ్బారాయుడు, రాహుల్‌హెగ్డే ఉన్నారు.
జ్ఞానముద్ర (రిటైర్డు సీఎస్ సోమేశ్‌కుమార్ భార్య), పావనీరావు (రిటైర్డు ఐపీఎస్ ప్రభాకర్‌రావు భార్య), ఐశ్వర్యరాజు (ఐఏఎస్ వికాస్‌రాజు భార్య), రిటైర్డ్ డీజీపీ అనురాగ్ శర్మ, ఓం అనిరుధ్ (రాచకొండ కమిషనర్ కొడుకు), నందిన్మాన్ (ఐపీఎస్ విక్రమ్‌సింగ్‌మాన్ భార్య), రీటా సుల్తానియా (ఐఏఎస్ సందీప్ సుల్తానియా భార్య), రాధిక (ఐపీఎస్ కమలాసన్‌రెడ్డి భార్య), నితేశ్‌రెడ్డి (రిటైర్డ్ డీజీపీ మహేందర్‌రెడ్డి కొడుకు) దివ్యశ్రీ (ఐఏఎస్ ఆంజనేయులు భార్య), రేణుగోయల్ (డీజీపీ జితేందర్ భార్య), రేఖా షరాఫ్ (ఐపీఎస్ ఉమేశ్ షరాఫ్ భార్య), హేమలత (ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి భార్య), ఇందూరావు (ఐపీఎస్ లక్ష్మీనారాయణ భార్య), ప్రతాప్‌సింగ్ (ఐపీఎస్ గోవింద్‌సింగ్ కొడుకు), రాహుల్ (రిటైర్డ్ ఐఏఎస్ జనార్దన్‌రెడ్డి కొడుకు), వరుణ్ (ఐపీఎస్ విశ్వప్రసాద్ కొడుకు) ఉన్నారంటూ వీరందరినీ ప్రతివాదులుగా పేరొన్నారు.