కాసిపేట, జనవరి 20 : ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2026లో భాగంగా వన్యప్రాణి గణనను(Wildlife census) ఈ నెల 20 నుంచి 25 తేదీ వరకు చేపట్టనున్నట్టు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ప్రవీణ్ నాయక్ తెలిపారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ముత్యంపల్లి సెక్షన్ పరిధిలో వన్యప్రాణి గణన చేపట్టారు. మూడు బీట్లలో బీటుకు ఇద్దరు చొప్పున వాలంటీర్ల సహాయంతో వన్యప్రాణి గణనను ప్రారంభించారు. మొదటి మూడు రోజులు శాఖాహార జంతువులకు సంబంధించి ట్రాన్సక్టు లైన్ సర్వే, రెండు కిలోమీటర్ల పరిధిలో సమాచారం సేకరించడం, అలాగే తర్వాత మూడు రోజులు మాంసాహార జంతువులకు సంబంధించి ట్రైల్ లైన్ సర్వే, ఐదు కిలో మీటర్లు నడిచినప్పుడు వన్యప్రాణుల పాదముద్రలు, విసర్జితాలు, వెంటికలు, చెట్లపై గీసిన గీతలు, భూమిపై పొర్లాడిన అచ్చులు తదితర గుర్తులు ఎం స్ట్రైప్స్ ఎకలాజికల్ (MStripes Ecological) యాప్ లో నమోదు చేస్తారన్నారు.
బెల్లంపల్లి రేంజ్ పరిధిలో గల 21 బీట్ల నందు ఈ సర్వే జరుగుతుందని అటవీ క్షేత్ర అధికారి బెల్లంపల్లి సీహెచ్ పూర్ణ చందర్ వివరించారు. ఈ సర్వే ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి పులుల గణన కోసం జాతీయ స్థాయిలో చేపడతారని, ఔత్సాహికులైన వ్యక్తులు ఇందులో మొదటిగానే తమ పేర్లను వాలంటీర్లుగా ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగా బెల్లంపల్లి డివిజన్ పరిధిలో ఐదుగురు వాలంటీర్లు హైదరాబాద్ కేరళ నుండి వచ్చారన్నారు. వారికి అన్ని సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు. వన్యప్రాణి గణనలో భాగంగా అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అటవీ ప్రాంతంలో అనవసరమైన కార్యకలాపాలు సీసీ కెమెరాలో నమోదైతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.