పలిమెల, ఫిబ్రవరి 16 : బైక్పై వెళ్తున్న ఇద్దరిని అడవిపంది ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండల కేంద్రానికి చెందిన పీటర్, పంకెన గ్రామానికి చెందిన దుర్గం ముత్తయ్య (45) ద్విచక్రవాహనంపై మహారాష్ట్రకు వెళ్లి మంగళవారం తిరుగు పయనమయ్యారు. పలిమెల మండలంలోని లెంకలగడ్డ గ్రామ సమీపంలోని పుల్సురు ఒర్రె సమీపంలో రాత్రి బైక్ను అడవి పంది ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ దుర్గం ముత్తయ్య మరణించాడు. గాయపడ్డ పీటర్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.