Vardhannapeta | వర్ధన్నపేట, జూలై 15 : కట్టుకున్నోడికి విషమిచ్చి కాటికి చేర్చిన ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని భవానీకుంటతండాలో జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబం కథనం ప్రకా రం.. భవానీకుంటతండాకు చెందిన జాటోత్ బాలాజీ (44) వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 8న తండావాసులు దాటుడు పండుగ నిర్వహించగా బాలాజీ చికెన్ తెచ్చి భార్య కాంతికి ఇచ్చి వండమని చెప్పాడు. కాంతి అప్పటికే గడ్డిమందు కలిపి ఉంచిన కూల్‌డ్రింక్‌ను గ్లాస్లో పోసి బాలాజీకి ఇచ్చింది. తాగిన కొద్దిసేపటికి గొంతు నొప్పిగా ఉందని బాలా జీ చెప్పడంతో వెంటనే తాళ్లకుంటతండాలో ఉన్న తన బావ ఇంటికి కాంతి వెళ్లిపోయింది. తండావాసులు బాలాజీని వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి హరిచందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చందర్ తెలిపారు.