హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను కిరాతకంగా చంపించిందో భార్య. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం రూరల్ మండలంలోని అక్కంపల్లి-రాచానపల్లి రోడ్డులో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. సురేశ్‌బాబు (43), అనిత (37) భార్యాభర్తలు. సురేశ్ అక్కంపల్లిలో చిన్న హోటల్ నిర్వహిస్తున్నాడు. అనితకు రెండు నెలల క్రితం ఫక్రుద్దీన్ (34)తో పరిచయం ఏర్పడింది. అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఈ విషయం సురేశ్‌బాబుకు తెలియడంతో తరచూ తాగొచ్చి భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో వేధింపులు అధికం కావడంతో భర్తను అంతమొందించాలని అనిత నిర్ణయించుకుంది. అతడిని చంపాలని ప్రియుడిపై ఒత్తిడి తెచ్చింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో హోటల్ మూసేసి బైక్‌పై ఇంటికి బయలుదేరిన సురేశ్‌బాబుపై ఫక్రుద్దీన్ దాడిచేశాడు. కిందపడిపోయిన అతడిపై స్క్రూడ్రైవర్‌తో విచక్షణ రహితంగా పొడిచాడు. అనంతరం బండరాయితో మోది హత్యచేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆరు గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు.