కామారెడ్డి, ఏప్రిల్ 26 : నాన్‌వెజ్ వండలేదని ప్రశ్నించినందుకు భర్తను భార్య హతమార్చిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. పట్టణ సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని గోసంగి కాలనీలో శివాజీ- లక్ష్మి దంపతులు కూలి పనులు చేస్తూ జీవనంసాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. శనివారం రాత్రి దంపతులు చిన్నపాటి గొడవ పడ్డారు.
ఈ క్రమంలో తనకు నాన్‌వెజ్ ఎందుకు వండలేదని భార్యను ప్రశ్నించగా క్షణికావేశంలో ఆమె కొడవలితో శివాజీ మెడపై దాడిచేసింది. ఈ దాడిలో శివాజీ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని, మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించి, లక్ష్మిని అదపులోకి తీసుకున్నారు. తండ్రి మృతిచెందడం, తల్లి జైలు పాలుకావడంతో పిల్లలు అనాథలుగా మారారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
అమీన్పూర్ , ఏప్రిల్ 26 : రూ.10కి కర్రీ ఇవ్వనందుకు యజమానిపై కత్తితో దాడిచేసిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. సీఐ నరేశ్ కథనం ప్రకారం .. అమీన్పూర్ తహసీల్ కార్యాలయానికి సమీపంలో ఓం శ్రీ కర్రీ పాయింట్‌ను అన్నదమ్ములు ఉదయ్, అజయ్ నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ కాలనీకి చెందిన జీవరత్నం కర్రీ ఇవ్వాలని అడగ్గా, రూ. 30 ఇవ్వాలని ఉదయ్ చెప్పాడు.
తనకు రూ.10కే కర్రీ ఇవ్వాలని కోరగా.. యజమాని ససేమిరా అనడంతో జీవరత్నం వెళ్లిపోయాడు. 15 నిమిషాల తర్వాత జీవరత్నం తల్వార్ కత్తితో షాపు వద్దకు వచ్చి ఉదయ్, అజయ్‌పై దాడి చేయగా ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వారిని దవాఖానకు తరలించారు. జీవరత్నంను అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.