(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): ‘ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులు చేపడుతాయి. ఏదో ఒక సాకు చూపుతూ పిటిషన్లు వేసి వాటిని అడ్డుకోవడం సరికాదు. తెలంగాణలోనూ కొన్ని ప్రాజెక్టులు నిర్మించారు. ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కాళేశ్వరాన్ని కూడా నిర్మించారు. ఈ ప్రాజెక్టు వల్ల కొన్ని వేల ఎకరాల్లో సాగు జరుగుతున్నది. తెలంగాణ వరి సాగులో ఎంతో పురోభివృద్ధి సాగించింది’ కాళేశ్వరం ఎంత గొప్ప ప్రాజెక్టో వివరిస్తూ సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవల చేసిన కీలక వ్యాఖ్యలివి.
అయితే, ఇవేమీ పట్టించుకోకుండా మేడిగడ్డలో పిల్లర్ కుంగడమే అదో పెద్ద నేరంగా రేవంత్ ప్రభుత్వం విష ప్రచారానికి తెరలేపింది. ప్రపంచంలోనే ఇంజినీరింగ్ మార్వెల్‌గా డిస్కవరీ ఛానల్ సహా ప్రఖ్యాత ఇంజినీర్లు పొగిడిన కాళేశ్వరం ప్రాజెక్టుపై పనిగట్టుకొని దుష్ప్రచారం సాగిస్తున్నది. ఈ క్రమంలో ఎన్నో ప్రశ్నలు మేధావుల మెదళ్లను తొలుస్తున్నాయి.
పిల్లర్ కుంగడమే నేరమా?
మేడిగడ్డ బరాజ్‌లో ఓ పిల్లర్ కుంగింది. అయితే, ఇది ప్రపంచంలో ఇంతకు ముందు ఎన్నడూ జరుగలేదా? ఒక్క మేడిగడ్డలోనే కొత్తగా జరిగిందా? మరి దీన్ని పట్టుకొనే రేవంత్ ప్రభుత్వం ఎందుకు అంతగా పాకులాడుతున్నది? మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం నీళ్లతో తెలంగాణను సుభిక్షం చేసిన సత్యాన్ని విస్మరించి ఆయన్నే దోషిగా నిలబెట్టేందుకు రేవంత్ సర్కారు ఎందుకు ప్రయత్నిస్తున్నది? మానవ జాతి చరిత్ర మొదలైనప్పటి నుంచి దేశంలోనే కాదు విదేశాల్లోనూ ఎన్నో ప్రాజెక్టుల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి. ప్రాజెక్టును కట్టడం ప్రారంభించగానే కూలినవి కొన్నైతే, కడుతున్నప్పుడు కూలినవి మరికొన్ని, కట్టగానే కూలినవి ఇంకొన్నైతే.. కట్టాక కొన్ని ఏండ్లకు కూలిన ప్రాజెక్టులు మరికొన్ని ఉన్నాయి. అంతెందుకు డ్యామ్‌లకు డ్యామ్‌లే కొట్టుకుపోయిన ఘటనలు కోకొల్లలు.
నదిలో ప్రాజెక్టు నిర్మాణమే ఓ వింత
అసలు ప్రవహించే నదిలో ప్రాజెక్టు నిర్మాణమే ఓ వింత అని ఇంజినీరింగ్ నిపుణులు చెప్తారు. కాళేశ్వరం అనేది ఒక ప్రాజెక్టు కాదు.. అది అనేక నిర్మాణాల సమాహారం. పలు పాత, కొత్త ప్రాజెక్టుల సమూహం. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం.. అనే మూడు పెద్ద బరాజ్‌లు, మూడు నదీగర్భ జలాశయాలు, 16 భూఉపరితల రిజర్వాయర్లు, 21 పంప్‌హౌస్‌లు, 20 లిఫ్టులు, 203 కిలోమీటర్ల పొడవైన సొరంగాలు, 1,531 కిలోమీటర్ల పొడవైన కాలువలు, బాహుబలి మోటర్ల పంపుహౌస్‌లు ఇన్ని కలిస్తే దాని పేరు కాళేశ్వరం. దీన్ని ఒక్క ప్రాజెక్టు అనడం కంటే ఓ మిషన్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే, ఇంతపెద్ద నిర్మాణాల సమాహారంలో మేడిగడ్డ అనే ఒక బరాజ్‌లో ఒక పిల్లర్ కుంగితే కాళేశ్వరమే కూలినట్టు రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. మోదీ స్వరాష్ట్రం గుజరాత్, బీహార్‌లో పాలకులు అసలు ప్రాజెక్టులనే కట్టలేకపోతున్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, బ్రిడ్జిలు పేకమేడల్లా కూలిపోతున్న ఘటనలను చూస్తూనే ఉన్నాం. ఇక్కడ మాత్రం ఒక్క పిల్లర్ కుంగిన దానికే కాంగ్రెస్ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారు.
కాంగ్రెస్ ద్రోహం ఏంటంటే?
ఆధునిక భారతానికి దేవాలయమంటూ మాజీ ప్రధాని నెహ్రూ ప్రశంసించిన భక్రానంగల్ ప్రాజెక్టు మొదలుకొని నిన్నమొన్నటి ప్రకాశం బరాజ్, పోలవరం వరకూ ప్రతీప్రాజెక్టు ఎక్కడో ఓ చోట సమస్యను ఎదుర్కొన్నదే. అయితే, మన దగ్గర కాళేశ్వరం కూలింది లేదు. పిల్లర్ మాత్రమే కుంగింది. ఇట్ల పిల్లర్ కుంగిందో లేదో.. దుష్ప్రచారం చేస్తూ రేవంత్ ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టునే పడావు పెడ్తున్నది. ఇలా దేశంలో సమస్యను ఎదుర్కొన్న ప్రతీ ప్రాజెక్టు దగ్గర ఇట్లాగే చేస్తే, ఒక్క ప్రాజెక్టు కూడా పనిచేసేదీ లేదు. ఒక్క ప్రాజెక్టు కింద ఎకరాకు నీళ్లు వచ్చేదీ ఉండదు. అలా మొత్తం దేశమే ఎడారిగా మారిపోతుంది.అసలు తెలంగాణకు కాంగ్రెస్ చేస్తోన్న ద్రోహం ఏంటంటే..? మేడిగడ్డ బరాజ్‌లోని ఒక్క పిల్లర్ కుంగిందన్న కారణంతో మొత్తం కాళేశ్వరమే కూలిపోయినట్టు దుష్ప్రచారం చేసి ప్రాజెక్టును పడావు పెడ్తున్నది. కేసీఆర్‌పై ఉన్న కక్షతోనే ఇదంతా చేస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక రెండోది.. కేంద్రంలోని మోదీ సర్కారు-చంద్రబాబుకు తలొగ్గి పిల్లర్ కుంగిన సాకుతో కాళేశ్వరాన్ని పక్కకు తప్పించి గోదావరిని తరలించుకుపోవడానికి మార్గాన్ని సుగమం చేసే కుట్రలాగా కనిపిస్తున్నదని మరికొందరు అంటున్నారు. అంతిమంగా కాంగ్రెస్ చేస్తున్న ఈ ద్రోహంతో తెలంగాణ బిడ్డలే ఆగంఅయ్యే పరిస్థితి నెలకొన్నదని చెప్తున్నారు.
కూల్చివేతలే పరమావధి
ప్రపంచంలో ఎన్నో ప్రాజెక్టులకు బుంగలు పడ్డాయి, పిల్లర్లు కుంగిపోయాయి, గేట్లు విరిగిపోయాయి. ప్రాజెక్టులే కొట్టుకుపోయాయి. వాటిని బాగుచేసిన ప్రభుత్వాలు మళ్లీ ఆ ప్రాజెక్టులను వాడుకొని ఫలాలు పొందుతున్నాయి. తెలివైనవారు దెబ్బతిన్న ప్రాజెక్టును తిరిగి మరమ్మతులు చేసుకొని వాడుకొంటారు. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం తీరు అలా లేనేలేదు. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క నిర్మాణం చేపట్టలేదు. కూల్చివేతలనే పరమావధిగా పెట్టుకొన్నది. ఆ కూల్చివేతల జాబితాలోకి కాళేశ్వరం వచ్చి చేరింది.
రేవంత్ వారిని ఒప్పించగలరా?
భక్రానంగల్ ప్రాజెక్టు నుంచి ఇప్పటి పోలవరం వరకూ.. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్ నుంచి రాహుల్ ప్రాతినిథ్యం వహిస్తున్న యూపీవరకూ ఎన్నెన్నో ప్రాజెక్టులు కూలిన మాట వాస్తవం. అంతెందుకు గత కాంగ్రెస్ పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా కూలలేదా? ఇప్పుడు కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌ను బద్నాం చేసినట్టే, తమ పాలనలో కూలిన ప్రాజెక్టులకు కాంగ్రెస్ బాధ్యత వహిస్తుందా? ఆ విధంగా సీఎం రేవంత్ ఒప్పించగలరా? బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో కూలిన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ కమిటీలు వేసి ఆయా రాష్ర్టాల్లోని బీజేపీ సీఎంలను ఇలాగే విచారణకు పిలిపిస్తారా? దీనికి రాష్ట్ర సీఎం రేవంత్, ప్రధాని మోదీ సమాధానం చెప్పగలరా? అని బుద్ధిజీవులు ప్రశ్నిస్తున్నారు.
ప్రాజెక్టు పేరు: చుంగ్తంగ్ డ్యామ్, సిక్కిం
ప్రారంభం: 2021
ప్రమాదం: వరదలతో తెగిపోయిన డ్యామ్
ప్రమాదం జరిగిన సంవత్సరం: 2023
అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ: ఎస్కేఎం
ప్రస్తుతం: ప్రాజెక్టును పునర్నిస్తున్నారు
ప్రాజెక్టు పేరు: భక్రానంగల్ ప్రాజెక్టు, హిమాచల్ ప్రదేశ్
ప్రారంభం: 1963
ప్రమాదం: వరదలతో డ్యామ్ గేట్లు దెబ్బతిన్నాయి
ప్రమాదం జరిగిన సంవత్సరం: 2024
అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ: కాంగ్రెస్
ప్రస్తుతం: గేట్ల రిపేరు పూర్తి చేసి వాడుకొంటున్నారు
ప్రాజెక్టు పేరు: వజోంట్ డ్యామ్, ఇటలీ
ప్రారంభం: 1960
ప్రమాదం: వరదలతో గేట్లు తెగిపోయాయి
ప్రమాదం జరిగిన సంవత్సరం: 1963
ప్రస్తుతం: రిపేర్ చేసి వాడుకొంటున్నారు
ప్రాజెక్టు పేరు : ముల్లపెరియార్ డ్యామ్, కేరళ
ప్రారంభం: 1895
ప్రమాదం: వరదలతో గేట్లు కొట్టుకుపోయాయి
ప్రమాదం జరిగిన సంవత్సరం: 2018
అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ: ఎల్డీఎఫ్
ప్రస్తుతం: కొత్త గేట్లను బిగించి వాడుకొంటున్నారు
ప్రాజెక్టు పేరు : తివారే డ్యామ్, మహారాష్ట్ర
ప్రారంభం: 2004
ప్రమాదం: వరదలతో తెగిపోయిన డ్యామ్
ప్రమాదం జరిగిన సంవత్సరం: 2019
అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ: బీజేపీ
ప్రస్తుతం: మరమ్మతులు చేసి డ్యామ్‌ను పునర్వినియోగంలోకి తెచ్చారు
ప్రాజెక్టు పేరు : మచ్చు డ్యామ్, గుజరాత్
ప్రారంభం: 1959
ప్రమాదం: వరదలతో తెగిపోయిన డ్యామ్
ప్రమాదం జరిగిన సంవత్సరం: 1979
అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ: జనతా పార్టీ
ప్రస్తుతం: తెగిపోయిన డ్యామ్చోట మచ్చు డ్యామ్-2 పేరిట కొత్త నిర్మాణం చేపట్టారు
ప్రాజెక్టు పేరు : ధవళేశ్వరం ఆనకట్ట, ఏపీ
ప్రారంభం: 1850
ప్రమాదం: వరదలతో ఆనకట్ట పూర్తిగా ధ్వంసమైంది
ప్రమాదం జరిగిన సంవత్సరం: 1970
అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ: కాంగ్రెస్
ప్రస్తుతం: పూర్తిగా పునర్నిర్మాణం చేశారు.
ప్రాజెక్టు పేరు : కంతాలే డ్యామ్, శ్రీలంక
ప్రారంభం: 1186
ప్రమాదం: నిర్వహణ లోపంతో వరదల్లో డ్యామ్ తెగిపోయింది
ప్రమాదం జరిగిన సంవత్సరం: 1986
ప్రస్తుతం: పునర్నిర్మించి వాడుకొంటున్నారు
ప్రాజెక్టు పేరు : డెర్నా డ్యామ్, లిబియా
ప్రారంభం: 1977
ప్రమాదం: వరదలతో డ్యామ్ కొట్టుకుపోయింది
ప్రమాదం జరిగిన సంవత్సరం: 2023
ప్రస్తుతం: ప్రస్తుతం అదే చోట కొత్త డ్యామ్ పునర్నిర్మిస్తున్నారు
ప్రాజెక్టు పేరు: నాగార్జునసాగర్, తెలంగాణ-ఏపీ
ప్రారంభం: 1967
ప్రమాదం: వరదలతో స్పిల్‌వే డ్యామేజీ, కాలువలకు గండ్లు
ప్రమాదం జరిగిన సంవత్సరం: 2009
అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ: కాంగ్రెస్
ప్రస్తుతం: మరమ్మతుల తర్వాత వినియోగంలోకి ప్రాజెక్టు.
ప్రాజెక్టు పేరు: పోలవరం ప్రాజెక్టు
ప్రారంభం: ఇంకా ప్రారంభం కాలేదు
ప్రమాదం: కొట్టుకుపోయిన డయాఫ్రంవాల్
ప్రమాదం జరిగిన సంవత్సరం: 2020
అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ: వైసీపీ
ప్రస్తుతం: కొత్త డయాఫ్రంవాల్ను ఏర్పాటు చేస్తున్నారు
ప్రాజెక్టు పేరు: హిరాకుండ్ డ్యామ్, ఒడిశా
ప్రారంభం: 1957
ప్రమాదం: వరదలతో డ్యామ్ గోడల్లో పగుళ్లు
ప్రమాదం జరిగిన సంవత్సరం: 2020
అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ: బీజేడీ
ప్రస్తుతం: పగుళ్లను పూడ్చి డ్యామ్‌ను పునర్వినియోగంలోకి తెచ్చారు
ప్రాజెక్టు పేరు : త్రపోవన్ హైడల్ ప్రాజెక్టు, ఉత్తరాఖండ్
ప్రారంభం: 2020
ప్రమాదం: వరదలతో ఏకంగా ప్రాజెక్టే కొట్టుకుపోయింది
ప్రమాదం జరిగిన సంవత్సరం: 2021
అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ: బీజేపీ
ప్రస్తుతం: అదే చోట కొత్త డ్యామ్‌ను నిర్మిస్తున్నారు
ప్రాజెక్టు పేరు: బాంకియో అండ్ షిమాంటమ్ డ్యామ్స్, చైనా
ప్రారంభం: 1952
ప్రమాదం: వరదలు, డిజైనింగ్ లోపాలతో డ్యామ్ కొట్టుకుపోయింది
ప్రమాదం జరిగిన సంవత్సరం: 1975
ప్రస్తుతం: డ్యామ్స్‌ను పునర్నిర్మించి వాడుకొంటున్నారు
ప్రాజెక్టు పేరు: సర్దార్ సరోవర్ ప్రాజెక్టు, గుజరాత్
ప్రారంభం: 2017
ప్రమాదం: వరదలతో డ్యామ్ గోడల నుంచి నీటి లీకేజీ
ప్రమాదం జరిగిన సంవత్సరం: 2023
అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ: బీజేపీ
ప్రస్తుతం: రిపేరింగ్ పనులు పూర్తిచేసి డ్యామ్‌ను వాడుకొంటున్నారు
ప్రాజెక్టు పేరు: కోసీ బరాజ్, నేపాల్
ప్రారంభం: 1962
ప్రమాదం: నిర్వహణలోపంతో వరదలు వచ్చి తెగిపోయింది
ప్రమాదం జరిగిన సంవత్సరం: 2008
ప్రస్తుతం: పునర్నిర్మించి వాడుకొంటున్నారు
ప్రాజెక్టు పేరు: ప్రకాశం బారాజ్, ఏపీ
ప్రారంభం: 1855
ప్రమాదం: వరదలతో గేట్లు విరిగిపోయాయి
ప్రమాదాలు జరిగిన సంవత్సరాలు: 1990, 2024
అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ: టీడీపీ
ప్రస్తుతం: గేట్లకు మరమ్మతులు చేసి వాడుకొంటున్నారు
ప్రాజెక్టు పేరు: శ్రీశైలం ప్రాజెక్టు, తెలంగాణ-ఏపీ
ప్రారంభం: 1981
ప్రమాదం: వరదలతో ప్లంజ్‌పూల్ వద్ద 150 అడుగుల గొయ్యి, విరిగిన గేట్లు
ప్రమాదం జరిగిన సంవత్సరం: 2009
అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ: కాంగ్రెస్
ప్రస్తుతం: మరమ్మతులు చేసి ప్రాజెక్టును వాడుకొంటున్నారు