Seethakka | హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : బోడిగుండుకూ మోకాలికి ముడిపెడితే ఎట్లా ఉంటుందో మంత్రి సీతక్క పరిస్థితి కూడా అట్లాగే తయారైందనే వాదన వినిపిస్తున్నది. అవినీతి ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్ లేవనెత్తిన అంశాలకు సమాధానాలు చెప్పకుండా, ఏకంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు జారీ చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది. మంత్రిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు తమ శాఖకు సం బంధించి వచ్చిన ఆరోపణలపై జవాబు ఇవ్వకుండా కేసీఆర్కు నోటీసులు ఇవ్వడమేమిటనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
అధికార పక్షం చేసే తప్పుదాలు, వేసే తప్పటడుగులను ప్రతిపక్షాల నాయకులు ఎత్తిచూపడం సర్వసాధారణం. అలా ఆరోపణలు చేయడం, విమర్శలు చేయడం ప్రజాస్వామిక లక్షణం. ఈ క్రమంలో రాష్ట్రంలో అంగన్వాడీలకు పంపిణీ చేసే సెల్ఫోన్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వంలో ఉన్నవాళ్లు తమ ప్రభుత్వంపై ఆరోపణలు వస్తే అవి ఆధారరహితమైతే వాటిని నిరూపించాలి. లేదా తప్పును అంగీకరించాలి. తప్పు ఎక్కడ జరిగిందో విచారించాలి. ఈ మౌలిక అంశాన్ని విడిచిపెట్టి ఆరోపణలు చేసిన ఒక దళిత నాయకుడిపై మంత్రి సీతక్క ‘చెప్పు తెగుద్దీ’ అని హెచ్చరించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలో అవినీతి ఆరోపణలు రావడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. అంతేకాకుండా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు.
‘వచ్చిన ఆరోపణలు, విమర్శలకు సహేతుకమైన సమాధానాలో, వివరణలో, విచారణకో ఆదేశించకుండా ఆమె ఏకంగా కేసీఆర్కు లీగల్ నోటీసులు ఇవ్వడమేమిటి? దీనికీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు ఏం సంబంధం? ఇదంతా బోడిగుండుకూ మోకాలికి ముడిపెట్టినట్టే ఉన్నద’నే ఆగ్రహం వ్యక్తమవుతున్నది. బీఆర్ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా వేదికలో తనపై దుష్ప్రచారం సాగుతున్నదని, అందుకు కేసీఆర్ బాధ్యత వహించాలంటూ ఆయనకు లీగల్ నోటీసులు ఇచ్చానని సీతక్క పేర్కొనడాన్ని పలువురు తప్పుబడుతున్నారు.
మంత్రిగా విచారణ జరిపిస్తామనో లేదా అవి నిరాధారమైన ఆరోపణలనో లేదా మరోరూపంలో సమాధానం చెప్పేందుకు ప్రయత్నించకుండా కేసీఆర్కు లీగల్ నోటీసులు పంపడం విడ్డూరంగా ఉన్నదని అంటున్నారు. ‘ప్రభుత్వంలో ఉన్నవాళ్లపై ఆరోపణలు వచ్చినపుడు ఆ ఆరోపణలకు జవాబు ఇవ్వాల్సింది పోయి అసలు సంబంధమేలేని కేసీఆర్ను లీగల్ నోటీసుల పేరుతో ఇందులోకి లాగడం ఏం నైతికత? బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వస్తే కేసీఆర్కు నోటీసులు ఇవ్వడమేమిటి? ఆయనకు ఏం సంబంధం? ఏం బాధ్యత? ఇదంతా ఆ రోపణలకు జవాబు ఇవ్వలేక విషయాన్ని పక్కదారి పట్టించడం కాదా? ఇదేం తీరు? ఇదేం నడత? రాష్ట్ర మంత్రిమండలిలో సభ్యురాలై ఉండి ప్రజాస్వామిక విలువలు విస్మరించి దుర్భాషలాడటం ఏం నీతి? ఏం న్యాయం?’ అని సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలో అవినీతి ఆరోపణలు చేసిన ఒక దళిత నేతపై మంత్రి సీతక్క చేసిన ‘చెప్పు’ల భాష పదప్రయోగంపై విమర్శలు వినిపిస్తున్నాయి. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న సీతక్క ఒక దళిత నాయకుడిపై అనుచిత పదప్రయోగంపై చేయడం దేనికి సంకేతమనే వాదన వినిపిస్తున్నది. సందర్భం అయినా కాకపోయినా, అవసరం ఉన్నా లేకపోయినా తానొక ఆదివాసీ బిడ్డనని, తన ఎదుగుదలను చూసి ఓర్వలేకనే తనపై ఆరోపణలు చేస్తున్నారని తరచూ వ్యాఖ్యానించే మంత్రి సీతక్క ఒక దళిత నేతను ఉద్దేశించి అట్లా వ్యాఖ్యానించడం సరైందేనా? అనే చర్చ దళిత వర్గాల్లో సాగుతున్నది.
అప్పుడు ‘అందరి సీతక్కను’ అంటూ చెప్పుకొని ఇప్పుడు మంత్రి అయ్యాక బెదిరింపులు ప్రదర్శిస్తే తామెందుకు సహిస్తామని దళితుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. దీంతో పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉన్నదని గ్రహించిన సీతక్క తక్షణ నష్ట నివారణ చర్యలకు దిగారని, అందులో భాగంగానే కేసీఆర్కు లీగల్ నోటీసుల జారీచేశారనే వాదన వినిపిస్తున్నది. రేవంత్రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యల వలయంలో చిక్కుకున్న ప్రతి సందర్భంలో సంబంధిత సమస్యకు పరిష్కారం చూపకుండా ప్రజల దృష్టిని మళ్లించడమే పాలన అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మంత్రి సీతక్క నోటీసులు జారీ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.