HYDRAA | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): లేక్ సిటీగా పేరుగాంచిన హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణ ఈ పదేండ్లలోనే జరిగిందా? గొలుసుకట్టు చెరువులతో నిండిన ఈ నగరంలో జలవనరుల విధ్వంసం ఇటీవలే మొదలైందా? వేల సంఖ్యలో చెరువులు, కుంటలు, నాలాలు ఉన్నా హైదరాబాద్‌లో వరదలు ఎందుకు వస్తున్నాయి. జల వనరుల పరివాహాక ప్రాంతాల్లో జరిగిన పట్టణీకరణే అర్బన్ ఫ్లడ్స్‌కు కారణమా? హైడ్రా పేరిట చెరువులు, కుంటల వెంబడి ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తే వరదలు తగ్గుతాయా? చెరువులకు పూర్వవైభవం వస్తుందా? కూల్చివేతలతోనే చెరువులకు పూర్వ వైభవం సంతరించుకుంటుందా? ఈ కూల్చివేతలతో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు మూల్యం చెల్లించేదెవరు? అంటూ రేవంత్ ప్రభుత్వం బుల్డోజర్ పాలనపై సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చలు జరుగుతున్నాయి. హైడ్రాతో చెరువుల సంరక్షణ ఎలా సాధ్యమనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతుంటే.. అసలు కూల్చివేతలతో భయాభ్రాంతులకు గురిచేస్తున్న హైడ్రా తీరు సరైనదేనా? అనే ప్రశ్నలను నగరవాసులు లేవనెత్తుతున్నారు. విశ్వనగరం గా ఎదగాల్సిన మహానగరంలో చెరువుల పరిరక్షణ పేరిట కూల్చివేతలతో ప్రతిష్ఠ దిగజారిపోతున్నదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
400 ఏండ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ లేక్ సిటీగా పేరు గాంచించింది. దేశంలో ఏ నగరంలో లేనన్ని గొలుసుకట్టు చెరువులు, కుంటలతో భాగ్యనగరం నిండిపోయింది. రాజుల కా లంలోనే ఇంటర్ లింకేజీ వాటర్ వ్యవస్థను ఏ ర్పాటు చేశారు. ఇందులోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్ట్రామ్ వాటర్, చెరవుల వ్యవస్థను ని ర్మించారు. పెరిగిన జనాభా, రాకెట్ వేగంతో విస్తరించిన హైదరాబాద్ నగర పరిధి, పట్టణీకరణతో వందల చెరువులు, కుంటలు నిర్వీర్యం అవుతున్నాయి. ఈ అంశాలేవీ పరిగణనలోకి తీసుకోకుండా కూల్చివేతలతోనే చెరువులకు పూర్వ వైభవం అన్నట్టుగా వ్యవహరిస్తున్న హైడ్రా తీరు వివాదస్పదంగా మారింది.
చెరువుల ఆక్రమణలు ఐదేండ్లో.. పదేండ్ల కిం దటో మొదలైనవి కావు. తరతరాలుగా నిర్వీ ర్యం అయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ పాలన వైఫల్యమే ప్రధాన పాత్ర పోషించగా, అధికారుల నిర్లక్ష్యం, కబ్జాకోరుల ఆక్రమణలు, పేదల నిర్మాణాలు ఉన్నాయి. ఉదాహరణకు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉండే చెరువుకు కనీసం ఐదారు ఇన్‌ఫ్లో చానల్స్ ఉంటాయి. చెరువు నిం డిన తర్వాత బయటకెళ్లిపోయేందుకు అవుట్ లెట్స్ ఉంటాయి. ఇదీ చెరువు వాస్తవ రూపం. చెరువు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరగానే ఎఫ్టీఎల్ ఏర్పడుతుంది. కానీ ఎఫ్టీఎల్ భూము ల్లో ఇప్పుడు నిర్మాణాలు జరిగాయి. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మాణ కార్యకలాపాలతో చెరువులోకి వచ్చే ఇన్లెట్స్ దెబ్బతిన్నాయి.
మూసీ రివర్ ఫ్రంట్ నుంచి మొదలుకుంటే, దుర్గం చెరువు పరీవాహక ప్రాంతంలో అమర్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వరకు విస్తరించిన అర్బనైజేషన్ కొత్తగా జరిగింది కాదు. హై డ్రా నివేదిక ప్రకారం నగరంలో ఉన్న 52 చెరువులు 60 శాతానికిపైగా నిర్మాణాలతో ఉన్నా యి. భవన నిర్మాణ అనుమతులు ఇచ్చినవే, ఇ రిగేషన్, రెవెన్యూ శాఖలు ధ్రువీకరించినవే. హైడ్రా ద్వారా కూల్చివేతలతోనే చెరువుల సంరక్షణ సాధ్యమా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది. చెరువుల ఇన్లెట్స్, అవుట్‌లెట్స్‌ను పునరుద్ధరించకుండా, పూడికను తీయకుండా కేవ లం నిర్మాణాలను కూలిస్తే చెరువుల నీటినిల్వ పెరుగుతుందా?అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
సబర్మతి తరహాలో మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టును చేపడతామని ప్రభుత్వం చెప్తున్నది. కా నీ సబర్మతి నది ఆధునీకరణలో ఎంతమంది ని రాశ్రయులయ్యారు? ఎంతమంది సొంత గూ టిని కోల్పోయారనే విషయం కూడా చర్చించా లి. మూసీ వెంబడి నివాసం ఉండేవారిలో మె జార్టీ జనాలు నిరుపేద, మధ్యతరగతివారే. ఇటీవల సున్నం చెరువు ఆక్రమణలను కూల్చివేసిన సందర్భంలో ఓ నిరుపేద కుటుంబం నివసించే అవకాశమే కోల్పోయింది. ఇది మానవ హక్కు ల ఉల్లంఘనే. ఇలాంటి సమస్యలను పరిష్కరించకుండా నేరుగా హైడ్రా బుల్డోజర్లను పేదల ఇండ్లపై దింపితే చెరువులు, నదులు, కుంటలకు పూర్వ వైభవం ఎలా సాధ్యం అవుతుంది? ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో బస్తీ నిర్మూలన కార్యక్రమాలపై వందల కేసులు సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఇక్కడ అలాంటి పరిస్థితి రావొద్దంటే వారికి పునరావాసం కల్పిం చి బఫర్ జోన్లో ఉండే నిర్మాణాలను కూల్చితేనే మూసీకి పూర్వ వైభవం సాధ్యం.
భవిష్యత్తులో పొంచి ఉన్న అర్బన్ ఫ్లడింగ్ను పరిష్కరించే మార్గాల అన్వేషణ ఎందుకు జరగడం లేదు? అన్నది మరో కీలక ప్రశ్న. జా తీయ విపత్తు నిర్వహణ సంస్థ కూడా ప్రత్యేక సూచనలు, ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ అవేవి పట్టనట్టు హైడ్రా కూల్చివేతలతో అర్బన్ ఫ్లడింగ్ నిరోధించగలగుతారా? అంటే ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. అర్బన్ ఫ్లడింగ్ ప్రభావాన్ని నియంత్రించేలా ప్రత్యేక స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఉన్న డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించాలి. అలా కాకుండా కూల్చివేతలతోనే పరిష్కారం ఎలా దొరుకుతుందని సోషల్ మీడియాలో విస్త్రృత స్థాయిలో ప్రశ్నలు, చర్చోపచర్చలు నడుస్తున్నాయి.
హైదరాబాద్ సిటీబ్యూరో/ముషీరాబా ద్, సెప్టెంబర్ 15: హైదరాబాద్‌లో ఇప్పటి వరకు 262 నిర్మాణాలను కూల్చివేసి 111. 72 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్టు హై డ్రా తెలిపింది. ఆ కూల్చివేతలు చేపట్టిన చో ట పరిరక్షణ చర్యలు మాత్రం చేపట్టలేదు. ఇటీవల రాంనగర్‌లోని మణెమ్మ గల్లీలోని ఓ ఇంటికి సమీపంలో నాలా ఆక్రమణలు ఉన్నట్టు గుర్తించి 20 రోజుల క్రితం భవనా న్ని హైడ్రా నేలమట్టం చేసింది. కానీ భవన నిర్మాణ వ్యర్థాలను తొలగించలేదు. ఇదే అదనుగా పక్కనే ఉన్న భవన యజమాని.. కూల్చివేతలు జరిగిన స్థలంలో ఒకటి, రెం డు ఫీట్లు జరిగి తాత్కాలిక రేకులు ఏర్పాటు చేశారు. మణెమ్మ గల్లీలో కూల్చివేతలు చేప ట్టి 20 రోజులవుతున్నా వ్యర్థాలను తొలగించలేదు. ఓ భవనం గోడకు రంధ్రం చేసి వదిలేశారు. భవనం మొత్తాన్ని కూల్చేస్తామన్న టౌన్‌ప్లానింగ్, హైడ్రా పత్తాలేవని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దృష్టి తీసుకెళ్లినా స్పందించటం లేదని స్థానికురాలు లక్ష్మీబాయి వాపోయారు. డ్రైనేజీ పైపులైన్‌పైనే వ్యర్థాలను పోయడంతో మొత్తం బ్లాక్ అయ్యి సంపుల్లోకి మురుగు నీరు వస్తున్నదని హైడ్రా తీరుపై మరో స్థానికురాలు శారద అసహనం వ్యక్తం చేశారు.