హైదరాబాద్ : రాజ్యాంగబద్ధమైన గవర్నర్(Governor) పదవిలో ఉన్న వ్యక్తులు రాజకీయ విమర్శలు చేయరని, రాష్ట్ర గవర్నర్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్ వై. సతీశ్ రెడ్డి (REDCO Chairman) ఆరోపించారు. ఇటీవల గవర్నర్ మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్,( CM KCR) రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు.
రాష్ట్ర గవర్నర్‌గా కాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సెక్రటేరియట్(Secretariat) ప్రారంభానికి గవర్నర్ ను పిలవాలనేది కేవలం ప్రభుత్వాల నిర్ణయం పైన ఆధారపడి ఉంటుందని, ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎందుకు అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని ప్రశ్నించారు. గవర్నర్ తన పదవి గౌరవాన్ని కాపాడే లాగా, పదవికి వన్నె తెచ్చేలాగా వ్యవహరిస్తే ప్రభుత్వం కూడా ప్రోటోకాల్(Protocal) పాటిస్తుందన్నారు.
రాష్ట్ర పాలన మెరుగుకు , ప్రజా సంక్షేమానికి , యువత భవిష్యత్‌కు రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను నెలల తరబడి పక్కన పెట్టిన గవర్నర్ ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమో ఆమెనే ఆలోచించుకోవాలని సూచించారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు, వరద సాయం, పంట సాయం, ప్రాజెక్టులకు జాతీయ హోదా గురించి మోదీ సర్కారును ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. బీజేపీ(BJP) ముసుగును తీసి పక్కన పెట్టాలని ఆయన వెల్లడించారు. రాజకీయాలే మాట్లాడాలి అనుకుంటే గవర్నర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే మోదీ హయాంలో రాజకీయ కుట్రలతో రాజ్ భవన్ గౌరవం మంట కలిసి పోయిందని విమర్శించారు.