హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పోలీసు ఫిర్యాదు మండలితోపాటు జిల్లా పోలీసు ఫిర్యాదు మండళ్ల ఏర్పాటుపై గతంలో ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ఆ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర పోలీసు ఫిర్యాదు మండలిని, జిల్లా పోలీసు ఫిర్యాదు మండళ్లను ఏర్పాటు చేశామని, నాలుగు వారాల్లోగా ఆయా కార్యాలయాల సిబ్బందిని నియమిస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. హామీని అమలు చేయకపోవడంపై న్యాయవాది మామిడి వేణుమాధవ్ వ్యక్తిగత హోదాలో దాఖలు చేసిన కోర్టు ధికరణ పిటిషన్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.