బాసర, మే 9 : ఆంధ్రా సాములోరు ఎట్టకేలకు కరుణించారు. పామర జనంపై దయతలచి నోరు విప్పారు. వేద పాఠశాల కమిటీ సభ్యులతో కలిసి శుక్రవారం విలేకరుల సమావేశం పెట్టారు. చివరికి వారు చెప్పింది ఎట్లున్నదంటే ‘ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే’ అన్నట్టు ఉన్నది. బాసరలోని ప్రైవేట్ వేద పాఠశాలలో ఇద్దరు విద్యార్థులపై అమానవీయ దాడి, ఓ విద్యార్థి మృతికి కారణం ఆంధ్రా స్వామీజీయేనని స్వయంగా పిల్లల తల్లిదండ్రులే ఆరోపిస్తుంటే ఆయన మాత్రం ఈ ఘటనల్లో నిందితులను పట్టుకొని చట్టపరంగా శిక్షించాలని కోరుతున్నామని చెప్పారు తప్ప అసలు ఆ దారుణాలకు కారణాలను మాత్రం చెప్పలేదు. వేద పాఠశాలలో విద్యార్థుల రక్షణ, బాధ్యత తనది కాదా? ఘటన జరిగిన వెంటనే పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? ఇలాంటి వివరణలేవీ ఇవ్వలేదు. ఆశ్రమం పాత్ర.. తన పాత్ర.. తన బాధ్యతను వివరించలేదు. ఏకంగా గోదావరి ఘాట్ కబ్జా పైనా మాట్లాడలేదు.
ఇంకా ఆంధ్రా సాములోరు తెలంగాణ ప్రజానీకానికి దయతలచి ఇచ్చిన గొప్ప వరం ఏమిటంటే నాలుకపై బీజాక్షరాలు రాయడం ఆపుతారట! అసలు బీజాక్షరం రాయడం అనేది ఆశాస్త్రీయం కాగా, దాన్ని ఆపేయడాన్ని తెలంగాణ సమాజానికి చేస్తున్న గొప్ప మేలు కింద ఆయన చెప్పకోవడం విడ్డూరంగా ఉన్నది. ఇద్దరు పిల్లలపై దాడి, ఒక పిల్లవాడి మరణానికి కారణం అని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మళ్లీ దేవ పాఠశాలను ప్రారంభిస్తానని ఎలా చెప్తారు? దర్యాప్తు పూర్తి కాకుండానే ఏ ధైర్యంతో చెప్తున్నారు? వేద పాఠశాల ఘటనపై విచారణ, దర్యాప్తు పూర్తి కాకుండానే పాఠశాలను ప్రారంభిస్తామని స్వామీజీ చెప్తుంటే జిల్లా ఉన్నతాధికారులు ఏం చేస్తున్నట్టు? గ్రామ కమిటీ, వేద పాఠశాల కమిటీ అని పేర్లు పెట్టుకొని బహిరంగంగా విలేకరుల సమావేశం పెట్టి తాను ఏం చేస్తానో.. ఏం చేయనో తనకు తానే స్వామీజీ ప్రకటించుకుంటుంటే ఇక్కడి అధికారులు, ఇరిగేషన్, రెవెన్యూ, దేవాదాయ శాఖల చేతులు పడిపోయాయా? అని స్థానిక నేతలు ప్రశ్నిస్తున్నారు. పిల్లవాడి మృతికి గల కారణాలను ఆన్వేషించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నట్టు? గోదావరి ఘాట్‌ను ఆంధ్రా సాములోరు పెట్టిన కబ్జాను తొలగించాల్సిన రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు ఏం చేస్తున్నట్టు? ఒక ప్రైవేట్ వ్యక్తి ఘాట్లలో గోదావరికి నిత్య హారతి, బీజాక్షరాలు రాయడం విషయాల్లో దేవాదాయ శాఖ ఏం చేస్తున్నదని పలువురు ఆధ్యాత్మిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు. వీటన్నింటినీ పరిశీలించాల్సిన ఉన్నతాధికారి ఏం చేస్తున్నరని నిలదీస్తుండ్రు.
ఓవైపు రాష్ట్రంలో చెరువులను పరిరక్షిస్తం.. అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని చెప్తూ హైడ్రా వంటి సంస్థను తెచ్చి కనికరం లేకుండా నిరుపేదల ఇండ్లను కూల్చివేస్తున్న ప్రభుత్వం, దర్జాగా గోదావరి ఘాట్‌ను కబ్జా పెట్టి షెడ్లు కట్టి వ్యాపారం చేస్తున్న ఆంధ్రా సాములోరిపై ఎందుకు ఇంత ఔదార్యం చూపిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా స్థానిక అధికార యంత్రాంగం ఎందుకు నోరు విప్పడం లేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతి మాత ఆలయానికి అప్రతిష్ఠ వచ్చి పడుతున్నదని తెలిసినా స్థానిక బీజేపీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడం వెనుక రహస్యం, మతలబు ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక గోదావరి హారతి నిర్వహణపై ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటది? ఎప్పుడు ఆదేశాలు జారీ చేస్తది? అన్న చర్చ నడుస్తున్నది.
త్వరలోనే వేద పాఠశాలను మళ్లీ ప్రారంభిస్తామని, గోదావరి నదికి హారతి కార్యక్రమాన్ని గ్రామ హారతి కమిటీ నిత్యం కొనసాగిస్తదని, దీనికి వేద పాఠశాల కమిటీ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని సదరు ఆంధ్రా సాములోరు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఆదేశిస్తే మాత్రమే నిత్యహారతి కార్యక్రమాన్ని నిలిపివేస్తామని సెలవిచ్చారు. అసలు గోదావరి హారతికి, స్వామీజీకి ఏం సంబంధం? గోదావరి నది తెలంగాణది.. నది వద్ద ఘాట్లు ప్రభుత్వం, ఇరిగేషన్, దేవాదాయ శాఖలకు చెందినవి. అక్కడ ‘నేనే హారతి ఇస్తా’ అని చెప్పడానికి స్వామీజీ ఎవరు? కమిటీ ఎవరు? మద్దతు ఇవ్వడానికి వేద పాఠశాల ఎవరు?