హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచే విద్యుత్తును ఎందుకు కొనుగోలుచేశారని జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ప్రశ్నించింది. భద్రాద్రి ప్లాంట్‌ను బీహెచ్ఈఎల్కు ఎందుకిచ్చారని అడిగింది. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్తు ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణంపై ప్రభుత్వం నియమించిన జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ సోమవారం విచారణ జరిపింది.
ఇప్పటికే పలువురికి నోటీసులు అందజేసిన కమిషన్.. గతంలో ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీలుగా పనిచేసిన దేవులపల్లి ప్రభాకర్‌రావు, సురేశ్చద్దాలను విచారించింది. బీఆర్కే భవన్లో జస్టిస్ నర్సింహారెడ్డి ముందు వీరు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఛత్తీస్గఢ్తోనే ఎందుకు ఒప్పందం చేసుకోవాల్సి వచ్చిందని కమిషన్ ప్రశ్నించగా గవర్నమెంట్ టు గవర్నమెంట్ అయితే పారదర్శకత ఉంటుందని సమాధానం ఇచ్చినట్టు తెలిసింది.
ఓపెన్ యాక్సెస్‌కు ఎందుకెళ్లలేదని అడుగగా అప్పట్లో ఉన్న ధరలను అనుసరించి అత్యంత తక్కువకే ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందం చేసుకున్నామని వివరించినట్టు సమాచారం. యాదాద్రి పవర్‌ప్లాంట్ కోసం దామరచర్లను ఎందుకు ఎంపికచేశారని ప్రశ్నించగా పోర్టుకు అత్యంత దగ్గరగా ఉండటం, ప్లాంట్ అవసరాలు తీర్చేందుకు సరిపడా నీళ్లు అందుబాటులో ఉండటం, సమీపంలో సిమెంట్ పరిశ్రమలుండటంతో ఫ్లైయాష్‌ను సులభంగా డిస్పోజ్ చేయగలమన్న ఉద్దేశంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దామరచర్లను ఎంపికచేసిందని చెప్పినట్టు తెలిసింది.
ఇక 12వ ప్లాన్‌లో కేంద్రం ఈ ప్లాంట్‌కు బొగ్గు కేటాయించలేదని ఇది కూడా ఓ కారణమని వారు చెప్పిన్టు సమాచారం. ఇక యాదాద్రి ప్లాంట్‌లో సబ్‌క్రిటికల్ టెక్నాలజీని ఎందుకు వాడారని అడుగగా, అప్పట్లో సబ్‌క్రిటికల్ టెక్నాలజీపై నిషేధమేమీ లేదని, అప్పట్లో ఉన్నవన్నీ సబ్‌క్రిటికల్ ప్లాంట్లేనని, రాష్ట్ర అవసరాలను త్వరగా తీర్చాలన్న ఆలోచనతో త్వరగా నిర్మించే ప్రయత్నంచేశామని, ఈ ప్లాంట్‌కు కేంద్రం అన్ని రకాల అనుమతులు ఇచ్చిందని వారు వివరించినట్టు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.
భద్రాద్రి ప్లాంట్ నిర్మాణంలో టెండర్లకు వెళ్లకుండా బీహెచ్ఈఎల్కు ఎందుకిచ్చారని అడుగగా, బెంచ్‌మార్క్ కంటే తక్కువకు కోట్చేయడంతోనే ఇచ్చామని వారు తెలిపినట్టు సమాచారం. మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులను కమిషన్ విచారించనున్నట్టు తెలిసింది. గతంలో ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలుగా పనిచేసిన ఎస్కే జోషి, అర్వింద్‌కుమార్‌లను విచారించనట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుత సీఎండీ ఎస్ఏఎం రిజ్వీని సైతం విచారించే అవకాశముందని సమాచారం.