Sitarama Lift Scheme | హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : సీతారామ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు అంచనాలు ఎందుకు పెరిగియో చెప్పాలని, ప్యాకేజీలవారీగా ఆ వివరాలను సమర్పించాలని ఇరిగేషన్ శాఖ ఆ ప్రాజెక్టు అధికారులను ఆదేశించింది. పెరిగిన అంచనాలపై స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్సీ) సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామం చేసేందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసింది. ఖమ్మం జిల్లాలోని 25 మండలాలతోపాటు వరంగల్ జిల్లాలోని ఒక మండలంలో మొత్తం 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించేలా ఆ ప్రాజెక్టును డిజైన్ చేసిన కేసీఆర్ ప్రభుత్వం.. 2016లో దాదాపు రూ.7,926 కోట్ల అంచనాతో పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. ఆ తర్వాత 2018లో ఆ అంచనాలను రూ.13 వేలకోట్లకు సవరించింది.
అనంతరం అదే ఏడాది ఫిబ్రవరి 16న నాటి సీఎం కేసీఆర్ స్వయంగా ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ప్రధాన కాలువ, 4 పంప్‌హౌజ్‌లు, పాలేరు లింక్ కెనాల్, సత్తుపల్లి ట్రంక్తో కూడిన ఆ ప్రాజెక్టును 16 ప్యాకేజీలుగా విభజించారు. వాటిలో 13 ప్యాకేజీలకు అనుమతులు మంజూరు చేయడంతో పనులు కూడా అప్పుడే ప్రారంభమయ్యాయి. డిస్ట్రిబ్యూటరీ పనులకు సైతం గతంలోనే అనుమతులిచ్చారు. ఇదిలావుంటే, తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టు అంచనాలను మరో రూ.7 వేల కోట్లు పెంచి దాదాపు రూ.20 వేల కోట్లకు సవరించింది. ఆ మేరకు సీతారామ ప్రాజెక్టు అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. కాగా, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండానే ఇటీవల ఆ ప్రాజెక్టు పనులకు అధికారులు టెండర్లు పిలవడం వివాదస్పదంగా మారడంతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీతారామ ప్రాజెక్టు పూర్తి వివరాలను ప్యాకేజీలవారీగా సమర్పించాలని తాజాగా ప్రభుత్వం కోరడం చర్చనీయాంశంగా మారింది.