మల్లాపూర్, జూన్ 5 : తెలంగాణే ధ్యాసగా గులాబీ జెండాను ఎత్తుకున్న ఆ గుండె, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని తట్టుకోలేకపోయింది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ను రోజంతా టీవీల్లో చూస్తూ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదని మరింత కలతచెందింది. ప్రజలకు అన్నీ చేసిన తన అభిమాన పార్టీ ఎందుకు ఓడిందన్న ఆవేదనతో చివరికి తుదిశ్వాస విడిచింది.
రెండు ఎన్నికల్లో గులాబీ పార్టీ వెనుకబడిందన్న ఆందోళనతో బీఆర్ఎస్ వీరాభిమాని, సీనియర్ కార్యకర్త తెలంగాణ తుక్కన్న మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందడం పార్టీ శ్రేణులను విషాదంలో ముంచింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేటకు చెందిన తెలంగాణ (గోల్కొండ) తుక్కన్న (80) బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు.
మంగళవారం పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెల్లడికాగా, రోజంతా టీవీ ముందే కూర్చున్నాడు. తెలంగాణలో బీఆర్ఎస్కు ఆశించిన ఫలితాలు రాకపోవడంపై తీవ్రంగా కలత చెందాడు. అటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ ఓడిపోవడం, లోక్‌సభ ఎన్నికల్లో అనుకున్న సీట్లు రాకపోవడంతో సాయంత్రం సమయంలో కనిపించిన ప్రతిఒక్కరితో చర్చించాడు. ‘తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చి అన్ని పనులూ మంచిగ చేసిన బీఆర్ఎస్కు ప్రజలు ఎందుకు ఓట్లెయ్యలేదు? పార్టీకి ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది’ అంటూ మనోవేదన చెందాడు.
అదే ఆవేదనతో రాత్రి ఇంటికి వెళ్లి నిద్రకు ప్రయత్నిస్తుండగా గుండెలో నలతగా ఉందని కుటుంబసభ్యులకు చెప్పాడు. వారు వచ్చి చూస్తుండగానే మంచంలో తుదిశ్వాస విడిచాడు. విషయం తెలిసి బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సంతాపం తెలిపారు. తుక్కన్న అంతిమసంస్కారాల కోసం వెంటనే రూ.10వేల సాయాన్ని బుధవారం ఉదయం స్థానిక నాయకుల ద్వారా కుటుంబసభ్యులకు అం దించారు. ఆయనకు చివరిసారిగా వీడ్కోలు పలికేందుకు గ్రామ, మండల నాయకులు, గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఎనిమిదేళ్ల క్రితం తుక్కన్న భార్య చనిపోగా, ఇద్దరు బిడ్డల పెండ్లిళ్లు చేసిన తుక్కన్న, కొడుకుతోనే ఉండేవాడు.
తుదిశ్వాసవరకు గులాబీ జెండాతోనే
తుక్కన్న బీఆర్ఎస్ ఏర్పడిన (2001) నుంచీ పార్టీలోనే కొనసాగాడు. గిలిపేటతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ ఉద్య మం జరిగినా, సమావేశమైనా, చివరికి చర్చ జరిగినా అక్కడికి కచ్చితంగా వెళ్లేవాడు. ప్రతి సమావేశంలోనూ పిడికిలెత్తి ‘జై తెలంగాణ.. జై జై తెలంగాణ’ అని దిక్కులు పిక్కటిల్లేలా నినదించేవాడు. ఉద్యమ సమయంలోనే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు గుర్తించి, ఆయనకు ‘తెలంగాణ తుక్కన్న’గా నామకరణం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనూ ఉత్సాహంగా పాల్గొన్న తుక్కన్న ఇక లేడని స్థానికులు విషాదంలో మునిగిపోయారు.