Rangareddy | ఖైరతాబాద్, ఆగస్టు 29 : ‘దశాబ్దాలుగా వ్యవసాయంపైనే ఆధారపడి సాగుచేసుకుంటున్నం. మా అసైన్డ్ భూములను దొంగపత్రాలు సృష్టించి ఆ దొరలు చెరబట్టిండ్రు’ అని కొండకల్ తండా గిరిజనులు వాపోయారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరుల ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. బాధితులు రవి రాథోడ్, లక్ష్మణ్, శంకర్, మోహన్ తదితరులు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ తండాలో సర్వే నంబరు 362, 363, 364, 369, 377లో ప్రొటెక్టెడ్ టెనెంట్స్ (పీటీ) భూములను తరతరాలుగా సాగుచేసుకుంటూ జీవిస్తున్నామని చెప్పారు.
1997 నాటి ప్రభుత్వం తమకు భూములను కేటాయిస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చిందని, మొత్తం 200 ఎకరాలు ఉండగా, 80 ఎకరాల్లో 400 మంది సాగు చేసుకుంటున్నట్టు తెలిపారు. అపర్ణ రియల్ ఎస్టేట్ కంపెనీ తమ భూములపై కన్నేసి దొంగ పత్రాలు సృష్టించి కబ్జా చేయడం మొదలు పెట్టిందని వాపోయారు. అసైన్డ్ భూములను కబ్జా చేయడంతో పాటు ప్రహరీ గోడలు కూడా నిర్మించిందని, తాము వ్యవసాయం కోసం భూమి వద్దకు పోతే ఆ సంస్థ బౌన్సర్లు, ప్రైవేట్ సెక్యూరిటీతో తమపై దాడులు చేయిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
మంత్రి పొంగులేటి పేరు చెప్పుకొని కబ్జాదారులు తమను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళనచెందారు. ఆయా సర్వే నంబర్లలో మంత్రి పొంగులేటి సతీమణి, కొడుకు పేరిట కూడా భూములు ఉన్నాయని, చాలా భూములు ఎఫ్టీఎల్లో ఉన్నాయని వివరించారు. చివరికి శ్మశాన వాటికలోని తమ పూర్వీకుల సమాధులను సైతం ధ్వంసం చేస్తున్నారని వాపోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. బాధ్యులను వదిలి తమపై, స్థానిక యువకులపై శంకర్పల్లి, మోకిల పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. తమపై దాడులు చేస్తున్న దుండగులపై మోకిల పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. తమ తండా వాసులకు ప్రాణగండం ఉన్నదని, సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి న్యాయం చేయాలని కోరారు.