ముషీరాబాద్, అక్టోబర్ 22: ‘ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో తెలిపేందుకు శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి జాబ్‌క్యాలెండర్‌ను ప్రకటించాలి’ అని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయా డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 24న హైదరాబాద్‌లో నిరుద్యోగ సదస్సు నిర్వహించాలని నిర్ణయించామని వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ విద్యానగర్‌లోని బీసీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తవుతున్నా, 50 వేల ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదని, అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను నిరుద్యోగ యువతతో వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఒకే దఫా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. గ్రూప్-2 సర్వీస్ కింద 503 పోస్టులను ప్రకటించారని, డైరెక్టు రిక్రూట్మెంట్ కోటా పోస్టులను లెక్కిస్తే 1,600కు పైగా ఉంటాయని, గ్రూప్-3 పోస్టులు 1,383గా ప్రకటించారని, వాస్తవానికి 3,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. గ్రూప్-4 కింద 8,500 పోస్టులను ప్రకటించారని, వాస్తవానికి 12,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఆయా ఖాళీలను లెక్కించి, వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కొత్త జిల్లాల్లోని అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను గుర్తించడంతోపాటు రెవెన్యూ, తాలూకా, మున్సిపల్ కార్పొరేషన్లు, కమిషనరేట్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో కొత్త పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, వేముల రామకృష్ణ, అంజి, అనంతయ్య, రవి, వెంకటేశ్, శంకర్‌నాయక్, బాలకోటి, రవికుమార్, సింధురెడ్డి తదితరలు పాల్గొన్నారు.