హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చాల్సిన పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం (పీఆర్ఈడీ) అధికారుల కొరతతో కునారిల్లుతున్నది. నోటిఫికేషన్లు లేక, ఉన్న సిబ్బందిపై పనిభారం పెరిగి అంతా అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా సెక్షన్ ఆఫీసర్ల కొరత తీవ్రస్థాయికి చేరింది. పీఆర్ఈడీలో మొత్తం 1,375 పోస్టులు ఉండగా ప్రస్తుతం 799 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన 42% పోస్టులు ఖాళీగా ఉండటంతో పర్యవేక్షణ కరువై పనులు నత్తనడకన సాగుతున్నాయి. పీఆర్ఈడీలో అత్యంత కీలకమైన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టులు ఏకంగా 464 ఖాళీగా ఉన్నాయి. మల్టీజోన్-1లో 260, మల్టీజోన్-2లో 204 పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నది. అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) విభాగంలో ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాల్సిన 92 పోస్టులకు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది చివరినాటికి రిటైర్ అయ్యేవారిని కూడా కలిపితే ఖాళీల సంఖ్య 618కి చేరుతుంది.