SLBC | మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ సొరంగంలో పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. లోపలికి వెళ్లి వచ్చిన సహాయ బృందాలు చెప్తున్న వివరాలు నివ్వెరపోయేలా ఉన్నాయి. పైకప్పు కూలిపోవడం, భారీగా నీరు, బురదతో ప్రమాదకరమైన పరిస్థితి నెలకొన్నది. బుధవారం సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తోపాటు మార్కోస్, ర్యాట్ మైనర్స్ టీమ్ తీవ్రంగా శ్రమించాయి. ఎట్టకేలకు 14వ కిలోమీటర్ సమీపంలోకి చేరుకున్నాయి. 13.5 కిలోమీటర్ల వద్ద పూర్తిగా ధ్వంసమైన టీబీఎన్ మిషన్ కన్వేయర్ బెల్టు, ఆక్సిజన్ ట్యూబ్, శిథిలాలను తొలగించడంతో కనిపించిన దృశ్యం చూసి అవాక్కయ్యారు. సొరంగం మొత్తం మూసుకుపోవడంతోపాటు 15 మీటర్ల ఎత్తు బురద పేరుకుపోయింది. పైకప్పు ఊడిపడడంతో టీబీఎం మిషన్ ముందుభాగం ధ్వంసమై వెనుకభాగం తన్నుకువచ్చింది. పైకప్పు కూలిన ప్రాంతం 200 మీటర్ల వరకు ఉంటుందని తెలిపారు.
మిషన్ తొలగింపే మెయిన్ టాస్క్
సొరంగంలో ప్రమాద స్థలానికి చేరుకోవాలంటే అడ్డుగా ఉన్న టీబీఎం కటింగ్, నీరు, బురద తొలగింపు కీలకంగా మారాయి. సొరంగం ఓపెన్ అయిన తర్వాత మళ్లీ కూలే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఇద్దరు టీబీఎం మిషన్ ఆపరేటర్లు, ఇద్దరు ఇంజినీర్లు, నలుగురు సహాయకుల మీద సొరంగం పైకప్పు కూలిందని భావిస్తున్నారు. ఇప్పటివరకు 40 మీటర్లే యాక్సిడెంట్ జోన్‌గా భావించిన సిబ్బంది లోపలికి వెళ్లిన కొద్దీ సొరంగ మార్గం ఎంత క్లిష్టమైందో అర్థమవుతున్నదని చెప్తున్నారు.
వెళ్లి రావడానికి ఐదు గంటలు
సహాయ బృందాలు టన్నెల్ లోపలికి వెళ్లి బయటకు రావడానికి ఐదు గంటల సమయం పడుతున్నది. దీంతో 11 బృందాలను మొహరించారు. ఆ బృందాల్లో నుంచి కొందరిని ఏరికోరి పంపిస్తున్నారు. వారందరూ లోకోటైన్లో లోపలికి వెళ్లి పరిస్థితులను అంచనా వేసి బయటికి వస్తున్నారు. ఆ తర్వాత ఏం చేయాలనే దానిపై తర్జనభర్జనలు పడుతున్నారు. సొరంగం పూర్తిగా మూసుకుపోయి బురద నీటితో నిండి ఉందని గుర్తించారు. అక్కడి నుంచి ముందుకు వెళ్లి, లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడం ఎలా? అనేదానిపై సహాయ బృందాల టీమ్ లీడర్లు ఆలోచిస్తున్నారు.
దారిచూపిన ర్యాట్ మైనర్స్
సొరంగంలోకి చొచ్చుకెళ్లడంలో ర్యాట్ మైనర్స్ టీమ్ కీలకంగా వ్యవహరించింది. ఈ టీమ్‌లో 25 ఏండ్ల లోపు 12 మంది యువకులు ఉన్నారు. వీరంతా సాహసోపేతంగా సొరంగం లోపలికి దూరి దారి చూపించారు. టన్నెల్లో ప్రమాద స్థలానికి అతి చేరువలోకి వెళ్లారు. 14 కిలోమీటర్ల పరిధిలో పైకప్పు ఊడిపడడంతో పూర్తిగా దెబ్బతిన్న టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు చేరుకుని, అక్కడి దృశ్యాలను చిత్రీకరించారు. ఉబికి వస్తున్న ఊటను… పేరుకుపోయిన బురదను లెక్కచేయకుండా సాహసోపేతంగా మిగతా బృందాలకు దారి చూపారు.
లోపల ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి
ఎస్ఎల్బీసీ టన్నెల్ మళ్లీ కూలే ప్రమాదం ఉంది. మా బృందం 11 మంది వెళ్లాం. మా వెనకాల ఎన్డీఆర్ఎఫ్ టీమ్ వచ్చింది. మేము వెళ్లినప్పుడు 22, 23 బ్లాకులు లూజ్‌గా ఉన్నాయని గుర్తించాం. వీటిని వెంటనే మళ్లీ ఫిక్స్ చేసి కిందికి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాం. అక్కడ ఏ క్షణమైనా మట్టి కూలే ప్రమాదం ఉందని మేము తిరిగి వచ్చేశాం. మేము వెళ్లగలిగే చివరి ఏరియా వరకు వెళ్లాం. మాకు ఎవరూ కనిపించలేదు. మేము డెహ్రాడూన్, ఉత్తరకాశీ ప్రమాదంలో 41 మందిని కాపాడాం. కానీ ఇక్కడ ప్రమాదంలో ఏం చెప్పలేకపోతున్నాం. ఇక్కడి పరిస్థితులు వేరేలా ఉన్నాయి.
-ఫిరోజ్ ఖురేషీ, ర్యాట్ మైనర్స్ టీమ్ లీడర్, ఢిల్లీ
లోపలికి వెళ్లేందుకు దారి చేశాం
ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో టన్నెల్ బోరింగ్ మిషన్‌ను గుర్తించాం. వెనక భాగాన్ని మొత్తం కవర్ చేశాం. అక్కడున్న బురద ఇతర శిథిలాలను పక్కకు జరిపాం. లోపలికి వెళ్లడానికి దారిని ఏర్పాటు చేశాం. టీబీఎం కింద ఎవరైనా చిక్కుకున్నారా అని చూశాం. పైకప్పు ఊడిపడడంతో టీబీఎం మిషన్ ముందు భాగం మొత్తం పాడైపోయింది. దాని మీదే మట్టి కూలింది. కూలిన చోట నుంచి నీటి ధారలు వస్తున్నాయి. కన్వేయర్ బెల్ట్‌ను కూడా రిపేర్లు చేస్తున్నాం. మాతోపాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్‌లు కూడా ఉన్నాయి.
-మున్నా ఖురేషీ, ర్యాట్ మైనర్స్ టీమ్, ఢిల్లీ