హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : ‘ప్రజా ప్రభుత్వం వైద్యం, విద్య కోసం నిధులు వెచ్చించడాన్ని ఖర్చులా చూడ టం లేదు. పెట్టుబడిగా భావిస్తున్నది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు మెరుగైన విద్య అందించి.. స్కిల్స్ నేర్పితే ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. నర్సింగ్ విద్యార్థులకు విదేశాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయి. విదేశీ భాషలు నేర్చుకుంటే రూ.లక్షల జీతాలు వస్తాయి..’ ఇవి ఇటీవల సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ చేసిన వ్యా ఖ్యలు. కానీ సీఎం మాటలకు, చేతలకు అస లు పొంతన కుదరడం లేదు. నర్సింగ్ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెం ట్ బకాయిలు రూ.500 కోట్ల వరకు పెండింగ్‌లో ఉండగా.. నర్సింగ్ ఫీజుల ఫిక్సేషన్ జీవోను కాంగ్రెస్ సర్కార్ రెండేండ్లుగా పెండింగ్‌లో ఉంచింది. ఈ ఫైల్ ఆర్థిక శాఖ వద్ద ఏడాదిగా పెండింగ్‌లో ఉన్నది.
నర్సింగ్ విద్యార్థుల ఫీజులను తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టీజీఏఎఫ్ఆర్సీ) ప్రతి మూ డేండ్లకూ ఫిక్స్ చేసి ప్రభుత్వానికి రికమెండేషన్ చేస్తుంది. దీని ఆధారంగానే విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ అం దిస్తారు. 2023-26 కాలానికి మొత్తం 13 కోర్సులకు సంబంధించి ఫీజులను టీజీఏఎఫ్ఆర్సీ ఫిక్స్ చేసింది. రికమెండేషన్లను ప్రభుత్వానికి పంపగా.. 2024 జులై 20న రాష్ట్ర ప్రభు త్వం జీవో 34 విడుదల చేసింది. నాటి నుంచి నేటి వరకు ఈ ఫైల్‌కు మోక్షం లభించలేదు. దీంతో 50వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నర్సింగ్ విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు.
ఫీజు ఫిక్సేషన్ అయితేనే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) వెబ్సైట్లో కొత్త ఫీజు వివరాలు కనిపిస్తాయి. ఆయా శాఖలకు నిధు లు విడుదల అయినప్పుడు స్కాలర్‌షిప్‌లకు డబ్బులు చెల్లిస్తారు. వెబ్సైట్లో ఫీజు వివరా ల కాలమ్‌లో ‘నిల్’ అని చూపించడంతో రెండేండ్లుగా చెల్లింపుల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో తమకు స్కాలర్షిప్లు రావడం లేదని, ఫీజు రీయింబర్స్మెంట్ కావ డం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. చేసేదేమీ లేక ఆయా శాఖలు తమకు మంజూరైన నిధులను వేరే స్కీమ్‌లకు డైవర్ట్ చేస్తున్నారని విద్యార్థులు వాపోయారు.
ప్రభుత్వానికి పలుమార్లు మొర పెట్టుకున్నా స్పందన కరువైందని పలు కాలేజీల యాజమాన్యాలు వాపోతున్నాయి. ఏడాదిగా ఈ ఫైల్ ఆర్థిక శాఖలో పెండింగ్‌లో ఉన్నట్టు చెబుతున్నాయి. ఇదే విషయమై డిప్యూటీ సీఎంను ఎన్నిసార్లు కలిసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వెలిబుచ్చాయి. ఈ ప్రక్రియ ముందుకు సాగకుండా అడ్డుకోవడం వెనుక మతలబు ఏంటీ..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు, కళాశాలల యాజమన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.