ఖైరతాబాద్, జూన్ 15 : రాష్ట్రంలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాలల(బీఏఎస్)బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని ఆ పాఠశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వీరన్న, శేఖర్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. బీఏఎస్ పాఠశాలలు దైన్యస్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 180 బీఏఎస్ స్కూళ్లు ఉండగా.. వాటిలో దళిత విద్యార్థులు 19 వేలు, గిరిజన విద్యార్థులు 7 వేల మంది చదువుతున్నట్టు తెలిపారు.
డేస్కాలర్ ఒకటో తరగతి ఎస్సీ విద్యార్థులకు రూ.28 వేలు, రెసిడెన్షియల్ విద్యార్థులకు రూ.42 వేలు, ఎస్టీ విద్యార్థులకు 3,5,8 తరగతుల వారికి రూ.42 వేల చొప్పున ప్రభుత్వం స్కాలర్షిప్ అందిస్తుందని, ఈ డబ్బుతో యాజమాన్యం ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య, భోజనం, యూనిఫాం, పుస్తకాలతోపాటు వసతి కల్పిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత నిధులు విడుదల కాలేదని, సుమారు రూ.210 కోట్లు పెండింగ్ ఉన్నట్టు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలని, లేకుంటే పాఠశాలలను నిర్వహించలేమని స్పష్టంచేశారు. అసోసియేషన్ ఉపాధ్యక్షులు బీచుపల్లి, జయసింహగౌడ్, కోశాధికారి లింగారెడ్డి, సలహాదారు రాయిరెడ్డి, లక్మారెడ్డి పాల్గొన్నారు.