ఉండవెల్లి, సెప్టెంబర్ 17 : ప్రమాదవశాత్తు కారు బోల్తాపడగా అదేసమయంలో అటు నుంచి వెళ్తున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఆగి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడికి ధైర్యం చెప్పారు. దవాఖానకు తరలించి ప్రథమ చికిత్స చేయించారు. వివరాలు ఇలా.. కర్నూల్ జిల్లా నందవరం మండలం పులచింతకు చెందిన నవీన్‌కుమార్ కారు కొనుగోలు చేశాడు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి క్షేత్రంలో పూజలు చేయించిన అనంతరం తిరిగి కర్నూల్ వైపు బయలుదేరాడు. ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు హైవేపై ప్రమాదవశాత్తు బోల్తాపడింది. అందులోని నవీన్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. అదే సమయంలో గద్వాల కలెక్టరేట్లో ప్రజాపాలన దినోత్సవానికి హాజరై తిరిగి వెళ్తున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తన కారును ఆపి.. బోల్తాపడిన కారును స్థానికుల సాయంతో సరిచేశారు. గాయపడిన నవీన్‌కు స్థానిక దవాఖానలో ప్రథమ చికిత్స అందించి తిరిగి పంపించారు. సాయం చేసిన ఎమ్మెల్యేకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపాడు.