Runa Mafi | హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : రూ.2 లక్షల వరకు అరకొరగా రుణమాఫీ చేసిన ప్రభుత్వం రూ.2 లక్షలకు పైగా రుణం పొందిన రైతుల పరిస్థితి ఏంటనేదానిపై స్పష్టత ఇవ్వడం లేదు. వీళ్లకు రుణమాఫీ ఎప్పటి నుంచి.. ఏ విధంగా చేస్తారనే అంశంపై స్పష్టత కొరవడింది. దీంతో 2 లక్షల వరకే మమా అనిపించేసి ఆపై రుణరైతులకు మొండి చేయి చూపిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు ఇప్పటికే రుణమాఫీ మొత్తం పూర్తి చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన మరింత ఎక్కవై అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నా రు. అధికారులు ఏ విషయం చెప్పలేక చేతులెత్తుస్తున్నారు.దీంతో 2 లక్షలకు దాటిన రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది.
ప్రభుత్వం రూ. 2 లక్షలకు పైగా రుణమాఫీకి సంబంధించి ఎలాంటి విధివిధానాలు ప్రకటించలేదు. ఈ రైతులకు సంబంధించి ఉత్తర్వుల్లో ఒకేఒక్క అంశాన్ని మాత్రమే ప్రస్తావించింది. రూ.2 లక్షలకు పైగా రుణం ఉన్న కుటుంబం ముందుగా 2 లక్షలకు పైగా ఎంత రుణం ఉన్నదో ఆ మొత్తాన్ని బ్యాంకులో జమచేస్తే ప్రభుత్వం రూ. 2 లక్షలు జమ చేస్తుందని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో 2 లక్షలకు పైగా ఉన్న రుణాన్ని ఎలా చెల్లించాలి?, ఎప్పటి వరకు చెల్లించాలనే అంశంలో స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్లక్ష్యం చూస్తుంటే ఎగవేత ప్లాన్లో ఉందా అనే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.
రూ.2 లక్షలకు పైగా ఉన్న రుణాన్ని ముం దుగా చెల్లించేందుకు సిద్ధమవుతున్న రైతులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఉదాహరణకు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రైతులకు వేర్వేరు బ్యాంకుల్లో తలా రూ.లక్ష అప్పు ఉన్నది. వీళ్ల మొత్తం అప్పు రూ.4 లక్షలు. ఇందులో వీళ్లు రూ.2లక్షలు బ్యాంకులకు ముందుగా చెల్లించాలి. అయితే తలా రూ. లక్ష మాత్రమే ఉండడంతో పైగల రూ. 2 లక్షలను ఎవరి ఖాతా కింద చెల్లించాలనే అంశంపై స్పష్టత లేదు. ఆ తర్వాత రుణమాఫీ ఎవరెవరికి అవుతుందో తెలియదు. రూ. 2 లక్షల పైన ఉన్న రుణం చెల్లించాలంటే మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పై చెప్పిన ఉదాహరణలో రైతు కుటుంబానికి రూ. 4 లక్షల అప్పు ఉంటే ఇందులో రూ. 2 లక్షల రుణమాఫీకి మరో రూ. 2 లక్షల అప్పు తెచ్చి బ్యాంకుల్లో కట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
రూ. 2 లక్షల వరకు 22.37 లక్షల మందికి రుణమాఫీ చేసినట్లు ప్రకటించిన ప్రభుత్వం అదే విధంగా రూ. 2 లక్షలకు పైగా రుణం గల రైతులు ఎంతమంది ఉన్నారనే లెక్కల్ని ఎందు కు ప్రకటించడం లేదని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వారికి రుణమాఫీకి ఎంత మొత్తం అవుతుందో ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ లెక్కల్ని బయటకు చెప్పకపోవడంతో మళ్లీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం రుణమాఫీ లెక్కల ప్రకా రం రాష్ట్రంలో రూ.2 లక్షలకు పైగా రుణం గల రైతులు సుమారు 20 లక్షల వరకు ఉన్నారు. రుణమాఫీకి మొత్తం అర్హుల సంఖ్య 42 లక్షలుగా ప్రభుత్వం పేర్కొన్నది. ఇప్పటి వరకు 22.37 లక్షల మందికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇంకా 19.63 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఈ నేపథ్యంలో వీళ్లంతా రూ. 2 లక్షలకు పైగా రుణం పొందిన రైతుల జాబితాలో ఉండాలి.దీనిపై అధికారు లు మాత్రం ఈ లెక్కలతో విభేదిస్తున్నారు. 2 లక్షల వరకు రుణమాఫీకి 22.37 లక్షల మంది అర్హులైతే… 2 లక్షలకు పైగా రుణ రైతు లు 20 లక్షల మంది ఏ విధంగా ఉంటారని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి మన రాష్ట్రంలో 90శాతం రైతులు సన్నకారు రైతులే దీంతో 2 లక్షల వరకు రుణమాఫీలో రైతుల సంఖ్య అధికంగా ఉండాలి. కానీ ఇందుకు భిన్నంగా 2 లక్షల వరకు రుణమాఫీలో రైతుల సంఖ్య తగ్గి.. దీంతో సమానంగా 2 లక్షలకు పైగా రుణ రైతులు ఉండడంపై అధికారుల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రూ. 2 లక్షలు రుణమాఫీ కావాలంటే ఆ పై రుణం ముందుగా చెల్లించాలనే నిబంధనపై రైతులు, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కండీషన్ పెట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు.ప్రభుత్వం ఎంత రుణమాఫీ చేయదల్చుకుందో ఆ మొత్తం చేయకుండా రైతులతో లింకు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని రైతుల బాధ్యతకు వదిలేయాలి గానీ ఇప్పుడే చెల్లించాలంటూ పీకల మీద కత్తిపెట్టడం ఏమిటని ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిబంధన తో రైతులు మళ్లీ అప్పుల కోసం ప్రైవేటు వ్యాపారుల వద్దకు పరుగులు తీస్తున్నారని తెలిపారు. ఒక్కొక్కరు రూ. 5 అంతకు మించి వడ్డీతో అప్పులు తీసుకొస్తున్నారని తెలిపారు. రైతులు అంత చేస్తున్నా ప్రభుత్వం నుంచి 2 లక్షలకు పైగా రుణమాఫీ ఎప్పుడు చేస్తారో స్పష్టత లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.