Assembly elections | హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ)/(స్పెషల్ టాస్క్ బ్యూరో): రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు? షెడ్యూల్ ఎప్పుడు రావొచ్చు? నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడవచ్చు? ఈ విషయంలో ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సమాచార సాధనాలు, సోషల్మీడియా గ్రూపులైతే 2018 షెడ్యూల్ను తీసుకొని అదే తాజా షెడ్యూల్ అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల నిపుణులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల ప్రకారం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తికావడానికి జనవరి 16, 2024వరకూ గడువు ఉన్నది. ఎన్నికల సంఘం (ఈసీ) మార్గదర్శకాల ప్రకారం.. అసెంబ్లీ తొలిసారిగా సమావేశమైన తేదీని ఐదేండ్ల కాలపరిమితికి ప్రామాణికంగా తీసుకొంటారు. ఈ లెక్కన తెలంగాణ అసెంబ్లీ తొలిసారిగా సమావేశమైన జనవరి 16, 2024 కంటే ముందు ఎన్నికల ప్రక్రియ పూర్తికావాల్సి ఉన్నది.
కనీసం 60 రోజుల కంటే ముందు..
2018లో మిజోరం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలతో కలిపి తెలంగాణకు ఎన్నికలు నిర్వహించారు. అయితే, మిగతా రాష్ర్టాల కంటే ముందే 2018 డిసెంబర్ 17న మిజోరం అసెంబ్లీ తొలిసారిగా సమావేశమైంది. ఈసీ మార్గదర్శకాల ప్రకారం.. మిజోరం అసెంబ్లీ తొలిసారిగా సమావేశమైన తేదీని ప్రామాణికంగా తీసుకొంటే.. వచ్చే డిసెంబర్ 17నాటికి అక్కడ ఎన్నికల ప్రక్రియ పూర్తికావాలి. అసెంబ్లీ గడువు పూర్తయ్యేందుకు కనీసం 60 రోజుల ముందు ఈసీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేస్తుంది. ఈ లెక్కన మిజోరం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ 17 కంటే ముందే వెలువడే అవకాశముంది. 2018లోలాగే ఈసారి కూడా మిగతా నాలుగు రాష్ర్టాలతో కలిపే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించనున్నట్టు సమాచారం. అయితే, తొలిసారిగా కొలువుదీరిన మిజోరం అసెంబ్లీ తేదీనే ప్రామాణికంగా తీసుకొని ఈసీ మిగతా రాష్ర్టాలకు కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశమున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ లెక్కన తెలంగాణలో అక్టోబర్ 17 కంటే ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావొచ్చని అంటున్నారు. విడివిడిగా ఇస్తే మాత్రం మిజోరం తరువాత కొద్దివారాలకు తెలంగాణకు సంబంధించిన ఎన్నికల షెడ్యూలు వచ్చే అవకాశం ఉంది.
అప్పుడే పెండ్లిళ్ల సీజన్
2018లో షెడ్యూల్ విడుదలైన ఆరు వారాలకు (నవంబర్ 18) మిజోరంలో పోలింగ్ జరిగితే, 8 వారాలకు తెలంగాణలో పోలింగ్ (డిసెంబర్ 7) నిర్వహించారు. ఈ లెక్కన నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ తొలి రెండువారాల్లో తెలంగాణలో పోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహాలు, ఇతర శుభకార్యాలకు కూడా ఇదే మంచి సమయం కావడం గమనార్హం. వచ్చే నవంబర్ 14 నుంచి డిసెంబర్ నెల మొత్తం (కార్తీక-మార్గశిర మాసం) శుభకార్యాలకు అనువుగా ఉన్నదని, దాదాపుగా ప్రతిరోజు మంచి ముహుర్తాలేనని శాస్త్ర పండితులు చెప్తున్నారు. రాష్ట్రంలో ఆ సమయంలో వేల సంఖ్యలో వివాహాలు జరుగవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో తెలంగాణలో పోలింగ్ తేదీపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. పోలింగ్ రోజున ఏదైనా శుభకార్యం పెట్టుకొంటే, సన్నిహితులు, బంధువులు వేడుకకు హాజరుకాకపోవచ్చని.. అలా జరుగకుండా ఉండాలంటే పోలింగ్ డేట్లో కాకుండా మిగతా రోజున శుభకార్యాలను పెట్టుకోవడమే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. షెడ్యూల్ విడుదలైతేనే దీనిపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.
