హైదరాబాద్, ఆగస్టు30 (నమస్తే తెలంగాణ): ఎన్నికలకు ముందుగా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు ఐఆర్‌ను ప్రకటించింది. అది ఇప్పటికీ ప్రభుత్వ రంగసంస్థలు, సమాఖ్యలు, సహకార సంఘాల్లో అమలు చేయని పరిస్థితి నెలకొన్నది. ఆయా సంస్థల్లోని ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి పీఆర్సీ పదవీకాలం జూలై 2022తో ముగియడంతో 2023అక్టోబర్‌లో రెండో పీఆర్సీని ఏర్పాటు చేశారు. 5శాతం ఐఆర్‌ను ప్రకటించారు. అయితే ఐఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సంఘాలు, ఫెడరేషన్లు, విశ్వవిద్యాలయాల బోధనేతర సిబ్బందికి మాత్రం చెల్లించడం లేదు. దీనిపై ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనేక పర్యాయాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండాపోయింది. ఇదే విషయమై ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయగా, ఆయా సంస్థల్లోని ఉద్యోగులకు సైతం ఐఆర్ చెల్లించాలని ఆర్థికశాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదేశాలు ఇచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడం గమనార్హం.
కాశీబుగ్గ, ఆగస్టు 30: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం కొత్త పత్తి వచ్చింది. సాధారణంగా అక్టోబర్ నుంచి కొత్త పత్తి మార్కెట్‌కు వస్తుంది. మద్దతు ధర కూడా అప్పుడే ప్రారంభమవుతుంది. ఈ సారి నెల రోజుల ముందే పత్తి మార్కెట్‌కు రావడంతో రైతులు, కార్మికులు, వ్యాపారులు సంతోషం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వ్యా పారులు కాంటాలకు పూజలు చేసి పత్తి కొనుగోలుకు కాంటా పెట్టారు. కేంద్రం క్వింటాకు మద్దతు ధర రూ. 7521 ప్రకటించగా.. ఏనుమాముల మార్కెట్లో క్వింటాకు రూ.7011 ధర పలికింది. హనుమకొండ జిల్లా ఐలోని మండలం వెంకటాపూర్‌కు చెందిన పిండి రవి 8 బస్తాలు తీసుకురాగా.. కుమారస్వామి అడ్తి ద్వా రా గోకుల్ కాటన్ వ్యాపారి కొనుగోలు చేశారు. పాత పత్తికి క్వింటాకు రూ.7,500 ధర పలికింది.