కరీంనగర్, మార్చి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో బీజేపీ నాయకులు శుక్రవారం రాత్రి దౌర్జన్యకాండకు దిగారు. కర్రలు, రాళ్లతో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఇంటిపై దాడికి యత్నించారు. పోలీసులు రావడంతో పెను ముప్పు తప్పిందని, లేదంటే పెద్ద విధ్వంసం సృష్టించే వారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇదే మండలానికి చెందిన బీజేపీ నాయకుడు రేపాక రామచంద్రారెడ్డి సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టడంతో టీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో బీజేపీ జిల్లా నాయకుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి శుక్రవారం టీఆర్ఎస్ నాయకులపై కేసుపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఇది తెలిసి అక్కడకు చేరుకొన్న తోట ఆగయ్య పార్టీ కార్యకర్తలను ఇండ్లకు పంపించారు. తానూ ఇంటికి వెళ్లారు. బీజేపీ నాయకులు ఎల్లారెడ్డిపేట ఠాణా ఎదుట ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా అందరూ లేచి, కర్రలు, రాళ్లతో ఠాణాకు అర కిలోమీటరు దూరంలో ఉన్న ఆగయ్య ఇంటి వైపు దూసుకెళ్లారు. ఆగయ్య ఇంటి ముందున్న.. బుగ్గ రాజేశ్వరతండాకు చెందిన టీఆర్ఎస్ సర్పంచ్ అజ్మీరా రజిత తిరుపతినాయక్, గుండారం సర్పంచ్ శంకర్‌నాయక్ కారు అద్దాలను ధ్వంసంచేశారు. అర్ధరాత్రి వరకు హంగామా సృష్టించారు. పోలీసులు అక్కడకు చేరుకొని దాడి జరుగకుండా అడ్డుకున్నారు.