కుట్రదారులకు ఆశ్రయం ఇవ్వడంలో ఆంతర్యమేమిటి?
పోలీసులు నిజానిజాలను నిగ్గుతేల్చుతుంటే వీళ్లు ధర్నాలు చేయడంలో మర్మమేమిటి?
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: బలహీనవర్గాల ప్రతినిధిగా ఎదుగుతున్న నేత, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను హత్య చేయడానికి ప్రయత్నించినవారికి బీజేపీ నేతలు ఆశ్రయం ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటన్న చర్చ మొదలైంది. సాక్షాత్తు బీజీపీ నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఢిల్లీలోని నివాసమే ఈ కుట్రదారులు తలదాచుకోవడానికి అడ్డా కావడంపై రాజకీయ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. జితేందర్ రెడ్డి పీఏ, డ్రైవర్.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్రపన్నిన వారిని రిసీవ్ చేసుకోవడం, వారిని వెంట పెట్టుకొని ఢిల్లీలో తిప్పడం, మాజీ ఎంపీ నివాసంలోనే కుట్రదారులకు ఆశ్రయం ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో గతంలో ఎన్నడూ ఈ తరహా పెడ ధోరణులు లేవని, ఇలాంటి పద్ధతులు ఆక్షేపణీయమని పలువురు బీసీ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. రాజకీయ కక్షలు ఉంటే రాజకీయంగా చూసుకోవాలని, కానీ, వ్యక్తులను హత్య చేయడం, హత్య చేయడానికి సుపారీ మాట్లాడుకోవటం ఎంత మాత్రం మంచిది కాదని, ఇది తెలంగాణ సంస్కృతి కాదని చెప్తున్నారు. సుభిక్షంగా ఉన్న రాష్ట్రంలో హత్యారాజకీయాలను బీజేపీ ప్రోత్సహిస్తున్నదనడానికి ఈ ఘటన నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. కుట్రను పోలీసులు బట్టబయలు చేయటంతో దీన్ని రాజకీయం చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధర్నాల పేరుతో డ్రామా ఆడటం అనేక అనుమానాలను సృష్టిస్తున్నది. అసలు ఈ మొత్తం కుట్రలో డీకే అరుణ, జితేందర్ రెడ్డి పాత్ర ఏమిటన్న అనుమానాలు కలుగుతున్నాయని బీసీ సంఘాల ప్రతినిధులు అంటున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల నుంచి ఎదిగిన శ్రీనివాస్‌గౌడ్ బలహీనవర్గాల పక్షాన గొంతు వినిపించే నేతగా ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు. ఆయన హత్యకు కుట్ర చేయడం సంచలనంగా మారింది. మొత్తం కుట్రలో ఇద్దరు బీజేపీ నేతల పాత్ర ఏమిటో నిగ్గుతేల్చాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. రూ.15 కోట్ల సుపారీ ఇచ్చేందుకు తెగబడ్డారంటే పెద్దఎత్తున కుట్ర జరిగినట్టే స్పష్టమవుతున్నదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. స్వేచ్ఛగా దర్యాప్తు చేయడానికి పోలీసులకు సహకరించాల్సిందిపోయి అడ్డంకులు సృష్టించేలా డీకే అరుణ, జితేందర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు దర్యాప్తు పూర్తిచేసిన తర్వాత అనుమానాలుంటే మాట్లాడాల్సిన నేతలు.. ఏదో కలవరపాటుకు గురైనట్టు వెంటనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం, పోలీసుల నిబద్ధతను శంకించేలా ఆరోపణలు చేయటం, ధర్నాల పేరుతో గందరగోళం సృష్టించటం, రాజకీయ రంగు పులమడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.