సిద్దిపేట, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘మల్లన్నసాగర్ నిర్మాణంపై ఆరోపణలు చేస్తున్న నవ్వు.. మరి మల్లన్నసాగర్ నీళ్లను ఎందుకు హైదరాబాద్‌కు తీసుకుపోతున్నవ్..’ అని సీఎం రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నిలదీశారు. ‘వందల మంది భూములు లాకున్నాడు.. అని వెంకట్రామిరెడ్డిని అంటున్నావ్.. ఆయన ఏమైనా సొంతానికి తీసుకున్నాడా? ఆయన చేసింది ప్రాజెక్టుల నిర్మాణం కోసం కాదా? అలా చేస్తేనే కదా ఇవ్వాళ లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందుతున్నది. మల్లన్నసాగర్ కట్టడం వల్లే వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ఫంక్షన్హాల్లో శనివారం నిర్వహించిన గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో హారీశ్‌రావు పాల్గొన్నారు. అనంతరం గజ్వేల్ మండలం ప్రజ్ఞాఫూర్‌లో బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, నాయకులు వేలేటి రాధాకృష్ణశర్మ, లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులతో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘లక్షలాది ఎకరాలకు సాగునీళ్లు అందించడంలో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంక్రటామిరెడ్డి కృషి ఎంతో ఉన్నది. కేసీఆర్ పట్టుదలతో కట్టించిన మల్లన్నసాగర్ నుంచే మీరు నేడు ఆగమేఘాల మీద హైదరాబాద్‌కు పైప్‌లైన్ వేస్తున్నారు. హైదరాబాద్ తాగునీటి కోసం మరి మల్లన్నసాగర్ నీళ్లు ఎందుకు తీసుకుపోతున్నరు? దేశంలోనే బెస్ట్ ఆర్అండ్ఆర్ కాలనీని కట్టించింది వెంకట్రామిరెడ్డే. దేశంలోనే ఉత్తమ ప్యాకేజీ ఇచ్చాం. కాంగ్రెస్ హయాంలో కట్టిన పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంలో సగమే ఇచ్చారు. లక్షల మందికి తాగు, సాగునీరు అందించి కొత్త వెలుగులు నింపాం. నష్టం వందమందికి జరిగితే లక్షలాది మందికి లాభం చేకూరుతున్నది. ఎకడ నుంచి వచ్చి ఇకడ నుంచి పోటీ చేస్తున్నావ్.. అని వెంకట్రామిరెడ్డిని అంటున్నావు, మరి మలాజిగిరిలో ఎంపీగా నువ్వు పోటీ చేయలేదా? ఉత్తరప్రదేశ్‌లో ప్రజలు ఓడిస్తే రాహుల్‌గాంధీ కేరళలోని వయనాడుకు వెళ్లి పోటీ చేయలేదా? అని నిప్పులు చెరిగారు.
పదవి కోసం అందర్నీ తొక్కుకుంటూ రావడం రేవంత్‌రెడ్డికి అలవాటేనని హరీశ్‌రావు విమర్శించారు. అందర్నీ తొకుకుంటూ ఈ స్థాయికి వచ్చిన అంటున్న రేవంత్‌రెడ్డి.. పదవి కోసం ఎవర్నీ అయినా తొకుతాడని మండిపడ్డారు. రాచరిక పాలన అని మమ్మల్ని విమర్శిస్తున్న రేవంత్.. ఆయన ఎన్నడు ప్రజలను కలిశారని నిలదీశారు. మీ పార్టీ నేతలు వీహెచ్, మోతుపల్లికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని వాళ్లే మీడియాకు చెప్పారని గుర్తుచేశారు. ‘మీ నాయకులనే కలువని నువ్వు.. మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది?’ అని రేవంత్‌రెడ్డిని నిలదీశారు. ఆరోగ్యం బాగాలేకపోయినా ఎర్రటి ఎండలో కేసీఆర్ రైతులను పరామర్శిస్తే.. సాయంత్ర వేళ హాయిగా క్రికెట్ చూస్తూ ఎంజాయ్ చేసింది నువ్వు కాదా? అని రేవంత్‌రెడ్డిని విమర్శించారు.
సీఎం రేవంత్‌రెడ్డి మెదక్‌లో మరోసారి తన మూ ర్కత్వాన్ని చాటుకున్నారని, ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తే సమాధానం చెప్పలేక అసహనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉండగా రాష్ట్రంలో అభివృద్ధి గజ్వేల్, మెదక్ జిల్లాలో మాత్రమే జరిగిందని చెప్పి, ఇప్పుడు ఇంకా అభివృద్ధి కాలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నాడని సీఎంపై మండిపడ్డారు. ఇందిరాగాంధీ మెదక్‌కు ఏం చేశారు? మెదక్‌లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారా? రైల్వేలైన్ తెచ్చారా? అని నిలదీశారు. ఇవన్నీ తెచ్చింది కేసీఆర్ అని చెప్పారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్ అని పేర్కొన్నారు. జిల్లాకు మూడు వర్సిటీలు కేసీఆర్ తెచ్చారని వివరించారు. ‘మెదక్ జిల్లాలో ఏం అభివృద్ధి జరిగిందో కండ్లు పెద్దవి చేసి చూడు రేవంత్.. లేకపోతే నువ్వొస్తే నేను చూపి స్తా’ అని చెప్పారు. మెదక్, సిద్దిపేట జిల్లాలను రద్దు చేస్తా అంటున్న నువ్వు ఈ రోజు మా జిల్లా గురించి మాట్లాడుతావా?’ అని నిలదీశారు. సింగూరు జలాలు మెదక్ జిల్లాను తాకాయంటే అంటే అది కేసీఆఆర్ చలవే అని చెప్పారు.
‘రాజకీయాల్లో విలువలు ఉండాలి. ముఖ్యమంత్రి పదవిపై గౌరవంతో నీ ఎత్తు గురించి మాట్లాడటం లేదు. కానీ, నీకు నీ భాషలోనే మాట్లాడితేనే అర్థం అవుతుంది. మాటిమాటికి దూలమోలే పెరిగావ్ అంటున్నావ్.. భూమికి జానెడు ఉన్న నీకు ఆవగింజంత మెదడు కూడా దేవుడు ఇవ్వలేదు.. అని నేననలా? సీఎం పదవిలో ఉండి సిగ్గులేని మాటలు.. మమ్మల్ని విమర్శించినప్పుడు మాకు కూడా విమర్శించే హకు ఉంటది. కానీ మాకు విజ్ఞత ఉంది. అందుకే విమర్శించడం లేదు. సీఎం పదవిలో ఉండి, ఆ స్థాయికి తగ్గట్టుగా మాట్లాడటం లేదు. వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదు’ అని రేవంత్‌కు హితవు పలికారు. పాలన చేతగాక, అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పడం చేతగాక తన బాడీ షేమింగ్‌పై రేవంత్ వ్యాఖ్యలు చేస్తున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
తెలంగాణ తెచ్చిన ఆ మహానేతపై ఇష్టమొచ్చినట్టు మొరగడాన్ని ప్రజలు గమనిస్తున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు రేవంత్ పిట్టలదొరలా మాట్లాడినట్టే ఇప్పుడూ మాట్లాడి ప్రజలను మభ్యపెట్టొచ్చని అనుకుంటున్నారని తెలిపారు. రేవంత్ మోసాలు ఈ నాలుగున్నర నెలల్లో ప్రజలకు అర్థమయ్యాయని, రేవంత్ ఎన్ని కట్టుకథలు, పిట్టకథలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని హరీశ్‌రావు అన్నారు. అబద్ధాలకు ఆసార్ అవార్డు లాం టిది ఎవరైనా ఇస్తే అది కచ్చితంగా రేవంత్‌కే వస్తుందని ఎద్దేవాచేశారు. ‘కారును ఇనుప సామాను కింద అమ్మడం కాదు.. నీ కాంగ్రెస్ పార్టీ చెయ్యి చచ్చుబడటం ఖాయం’ అని విమర్శించారు.
‘డిసెంబర్ 9న రూ.2 లక్షల పంట రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలేదని, ఇప్పటికీ రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేస్తున్నదని నీవు కాదా?’ అని సీఎం రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. ‘కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా’ అని చెప్పావ్.. మాటమీద నిలబడే నైజం నీకు అందా? అని నిలదీశారు. అత్యధిక ఎమ్మెల్యే సీట్లు బీసీలకు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు. ‘బీసీలను, ఎస్సీలను మో సం చేసింది నువ్వు. మైనార్టీల ఓట్లు వేసుకొని గెలిచి మైనార్టీలకు క్యాబినెట్లో అవకాశం కల్పించలేదు. మైనార్టీలు క్యాబినెట్లో లేకుండా ప్రభుత్వం నడుతున్నది నువ్వే’ అని రేవంత్‌పై హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా వడగండ్ల వానలుపడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభు త్వం పట్టించుకోవడం లేదని హరీశ్‌రావు మండిపడ్డారు. రైతులను మంత్రులు ఎవరూ కలవడం లేదని ఆక్షేపించారు. కేంద్రాల్లో రైతుల పోసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.