TGSRTC | హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఆదెరువుగా ఉన్న స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ (ఎస్ఆర్బీఎస్)ను క్రమంగా మూసివేసే కుట్రకు ఆర్టీసీ తెరతీసిందని కార్మిక సంఘాల జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ ప్రయత్నాలను విరమించుకోవాలని కోరుతూ జేఏసీ చైర్మన్ వెంకన్న, కోచైర్మన్ హన్మంతు ముదిరాజ్, వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి, కన్వీనర్ మౌలానా యాజమాన్యానికి గురువారం లేఖ రాశారు.
ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్ఆర్బీఎస్ను 1989 నుంచి అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఈ సీమ్ ద్వారా నెలవారీ ఆర్థిక ప్రయోజనం కలిగిస్తున్నదని తెలిపారు. కీలక నిర్ణయాలు తీసుకునేముందు యూనియన్లను సంప్రదించాలని చెప్పారు. స్కీమ్‌ను ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తే జేఏసీ ఆధ్వర్యంలో జరిగే ఆందోళనలకు యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.