Temples | హైదరాబాద్, జూలై 16(నమస్తేతెలంగాణ): ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లాల్సిన ఆలయాలు, ప్రభుత్వ విధానాల ద్వారా వ్యాపార కేంద్రాలుగా మారాయనే విమర్శలు వస్తున్నాయి. ఆలయాలకు వస్తున్న ఆదా యం కొండంత అయితే వాటికి ఖర్చుచేస్తున్నది గోరంతేనని, అయినా ఆలయాల నిర్వహణ, వాటి ఆస్తులపై ప్రభుత్వ అజమాయిషీ ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలోని గుడులకు ప్రభుత్వసాయం ఏమీ లేకపోగా, వాటి ఆదాయంతోనే అర్చకులు, ఉద్యోగులకు వేతనాలిస్తున్నారు. కొంత మొత్తాన్ని కామన్ గుడ్ ఫండ్ పేరిట సేకరించి అరకొరగా ఆలయాల అభివృద్ధికి వినియోగిస్తున్నారు.
ఆదాయం ఉంటేనే ఆదరణ
రాష్ట్రంలో 1959లో దేవాదాయ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పటినుంచి కమిషనర్ ఆధ్వర్యంలో ప్రభుత్వాలు ఆలయాల ఆదాయ వ్యయాలను పర్యవేక్షించడం మొదలుపెట్టాయి. 1987లో ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేస్తూ ఆలయాలను పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్నది. ట్రస్టీలు ఉన్నా ఆదాయ, వ్యయాలు, ఆస్తులపై ప్రభుత్వానిదే పూర్తిస్థాయి పెత్తనం. ఆదాయం లేని వాటిని పట్టించుకోకుండా ఉన్న ఆలయాలనే నిర్వహిస్తూ వాటిని వ్యాపార కేంద్రాలుగా మార్చారన్న వాదనలున్నాయి.
ఈ విధానంతో చారిత్రక ప్రాధాన్యంగల అనేక పురాతన ఆలయాలు ఆదాయం లేక నిరాదరణకు గురై కనుమరుగవుతున్నాయి. భక్తులు ఇచ్చిన మాన్యాలు కబ్జా అవుతున్నా పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా ఆలయాల ఆస్తుల పరిరక్షణపై ప్రభుత్వాలు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నాయి. ఆలయాల ఆదాయాన్ని ధార్మిక ప్రచారం, ధర్మ పరిరక్షణ, సంప్రదాయాల పునరుజ్జీవం, ఆచార వ్యవహారాల ఉనికిని కాపాడేందుకు వెచ్చించాల్సి ఉన్నా ఇవేవీ చేయకుండా మౌలిక సదుపాయాల పేరుతో అరకొర సౌకర్యాలు కల్పించి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది.
అభివృద్ధి పేరిట వ్యాపారం
అభివృద్ధి పనుల పేరిట ఆలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చి ప్రతిదానికీ ధర నిర్ధారించి భక్తులనుంచే వసూలు చేస్తున్నారు. చెప్పుల స్టాండు, మొబైల్ ఫోన్లు, లగేజీ కౌంటర్లు, పార్కింగ్ ఫీజు, కొబ్బరికాయ టిక్కెట్, వివిధ పూజల టిక్కెట్లు, ప్రత్యేక, వీఐపీ దర్శనాలను వేలం ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. చివరికి ప్రసాదాన్ని కూడా ప్యాక్చేసి విక్రయిస్తున్నారు. అర్చకులకు వేతనాలు నిర్ణయించి ఎంతోకాలంగా పనిచేస్తున్న పూజారులను కూడా బదిలీ చేసే కొత్త సంప్రదాయానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
వేములవాడ లాంటి ఆలయాలకు కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా భక్తుల కోసం కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. గోశాలల్లో గోవుల పోషణ పట్టించుకున్న నాథుడు లేడు. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా, ధర్మ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టకుండా, ఆలయ ఆస్తులను కాపాడకుండా, ఆలయాలను అభివృద్ధి చేయకుండా ప్రభుత్వం కేవలం పెత్తనం మాత్రమే చేస్తున్నదని భక్తులు విమర్శిస్తున్నారు. ఇవన్నీ చాలవన్నట్టు కేంద్రం ఏటా ఆలయాలకు ఐటీ నోటీసులు పంపుతూ ఆదాయ పన్ను వసూలు చేస్తుండడం విశేషం.
అర్చక ఉద్యోగుల బదిలీలు నిలిపివేయాలి : జేఏసీ నేతలు
అర్చక ఉద్యోగుల బదిలీలు వెంటనే నిలిపివేయాలని దేవాలయ అర్చక ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు జేఏసీ నేతలు పరాశరం రవీంద్రాచార్యులు, అగ్నిహోత్రం చంద్రశేఖర శర్మ మంగళవారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. తమ విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, అర్చకుల బదిలీలు నిలిపివేస్తామని హామీ ఇచ్చినట్టు జేఏసీ నేతలు తెలిపారు. అంతకుముందు అర్చక సంఘం నేతలు మంత్రికి వేద ఆశీర్వచనం అందించారు.