High Court | హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : రాజ్యాంగం ప్రకారం పౌరులంతా సమానమేనని హైకోర్టు స్పష్టం చేసింది. పేదల పట్ల ఓ మాదిరిగా, పెద్దల పట్ల మరో మాదిరిగా వ్యవహరించడం సరికాదని అధికారులను మందలించింది. కేవలం 10 మీటర్ల స్థలంలో పేదలు గుడిసె వేసుకుని జీవిస్తుంటే అలాంటి జాగాలను క్రమబద్ధీకరించని ప్రభుత్వం.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో స్థలాల అక్రమణలను ఎలా క్రమబద్ధీకరిస్తుందని నిలదీసింది. గచ్చిబౌలి 51-53 సర్వే నంబర్లలోని 42.24 ఎకరాల్లో అక్రమ నిర్మాణాల తొలగింపునకు 2022 జులైలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కాలేదంటూ ఎం యాదయ్య అనే వ్యక్తి దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి శుక్రవారం మరోసారి విచారణ జరిపారు.
అ ప్రాంతంలో యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీచేసినప్పటికీ అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని, ఆ నిర్మాణాలను అధికారులు అనుమతిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా ఈ విచారణకు హాజరైన హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ స్పందిస్తూ.. అక్కడ భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయలేదని చెప్పారు. దీనిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. యధాతథ స్థితిని కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ అక్రమ నిర్మాణాలు కొనసాగడాన్ని ఏమనుకోవాలని ప్రశ్నించింది. అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే హైడ్రా ఏం చేస్తున్నదని నిలదీస్తూ.. కోర్టును తకువగా అంచనా వేయవద్దని హెచ్చరించింది. గత ఉత్తర్వుల ప్రకారం ఆ నిర్మాణాలను కూల్చివేయలేదని తేలిన పక్షంలో హైకోర్టు తన విచక్షణాధికారాలను వినియోగించాల్సి ఉంటుందని జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలపై తాజా నివేదికను సమర్పించాలని శేరిలింగంపల్లి జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశిస్తూ.. తదుపరి విచారణను మార్చి 7కి వాయిదా వేశారు.