ప్రజాస్వామ్య సమగ్రతను దెబ్బతీస్తూ, ఓటర్ల తీర్పును అపహాస్యం చేస్తూ ఒక పార్టీ టికెట్‌పై గెలిచి మరో పార్టీలోకి దూకే ‘ఆయారామ్.. గయారామ్’ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ పరిస్థితి రాజకీయ వ్యవస్థలో మరింత అస్థిరతను, గందరగోళాన్ని సృష్టిస్తున్నది. దీన్ని గమనించే రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1985లో ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని’ తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని మరింత బలోపేతం చేయడానికి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, న్యాయస్థానాలు తమ వంతు కృషి చేశాయి. (స్పెషల్ టాస్క్ బ్యూరో)
ఒక రాజకీయ పార్టీ టికెట్‌పై చట్టసభలకు ఎన్నికైన సభ్యులు స్వార్థప్రయోజనాలతో మరొక పార్టీలోకి మారడాన్నే ‘పార్టీ ఫిరాయింపు’గా వ్యవహరిస్తారు. ఈ చర్యలను నియంత్రించడానికే ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని’ తీసుకొచ్చారు.
పార్టీ ఫిరాయింపులను నియంత్రించడమే లక్ష్యంగా 1985లో కేంద్రంలోని అప్పటి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం.. 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పదో షెడ్యూల్‌ను చేర్చింది. ఆర్టికల్స్ 101, 102, 190, 191ల్లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి వివరించారు.
వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి 91వ రాజ్యాంగ సవరణ చట్టం-2003 పేరిట రాజ్యాంగ సవరణ చేపట్టింది. 2004 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
స్పీకర్ నిర్ణయంపై కోర్టులో సవాల్
1993లో కిహోట హాల్లో హాన్ వర్సెస్ జాచిల్హూ కేసులో సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభ్యుల అనర్హతలను ప్రకటించడంలో స్పీకర్‌ది తుది నిర్ణయం అయినప్పటికీ, దీనిపై న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుందని కోర్టు పేర్కొన్నది. స్పీకర్ నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో సవాలు చేయడం రాజ్యాంగబద్ధమేనని చెప్పింది.
సభ్యుడు బహిష్కరణకు గురైనప్పుడు..
చట్టసభ సభ్యుడు బహిష్కరణకు గురైనప్పుడు అతడిని ఆ సభకు చెందని వ్యక్తిగా పరిగణిస్తారు. అయితే, ఆ వ్యక్తి పాత రాజకీయ పార్టీలో సభ్యుడిగానే కొనసాగుతాడు. ఒకవేళ ఆ వ్యక్తి వేరే రాజకీయ పార్టీలో చేరితే తన పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టే. ఈ సందర్భంగా అతన్ని అనర్హుడిగా ప్రకటించవచ్చు. ఈ మేరకు 1996లో జీ విశ్వనాథన్ వర్సెస్ తమిళనాడు శాసనసభ స్పీకర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
రాజ్యసభలో శాసనసభ్యుడి విషయంలో..
2006నాటి కులదీప్నాయర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ప్రకారం.. రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్ర శాసనసభ్యుడు పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ఓటేస్తే పదో షెడ్యూల్ ప్రకారం అతనిపై పడే అనర్హత ఉనికిలోకి రాదు. అయితే, రాష్ట్ర శాసనమండలి సభ్యుల విషయంలో ఇది వర్తిస్తుందని సుప్రీంకోర్టు వెల్లడించింది.
స్పీకర్ నిర్ణయంలో జాప్యంపై..
ప్రజాప్రతినిధులపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని 2024 జనవరిలో మహారాష్ట్రలోని శివసేన(ఠాక్రే-షిండే), ఎన్సీపీ (శరద్-అజిత్) కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలనిచ్చింది.