హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని వర్సిటీల్లో విద్యాప్రమాణాలు అట్టడుగు స్థాయికి దిగజారాయని పలువురు వైస్చాన్స్లర్లు ఆందోళన వ్యక్తంచేశారు. ఫ్యాకల్టీని రిక్రూట్చేయకపోవడంతో వర్సిటీల్లో బోధన, రీసెర్చ్ ముందుకుసాగడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్ ఫ్యాకల్టీతో వర్సిటీలను ఎలా నడపాలని ప్రశ్నించారు. పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని కోరారు. యూనివర్సిటీ వైస్చాన్స్లర్ల సమావేశాన్ని సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు వీసీలు సమస్యలు ఏకరువుపెట్టారు. రిక్రూట్మెంట్కు సంబంధించిన జీవో-21పైనా చర్చ జరిగినట్టు సమాచారం. ఈ జీవోను సవరించాల్సిందేనని కొందరు వీసీలు సమావేశంలో పట్టుబట్టినట్టు తెలిసింది. జీవో-21ని మార్చకుండా నోటిఫికేషన్లు ఇవ్వడం వీలుకాదని ఖరాఖండిగా చెప్పినట్టు సమాచారం.
రిపోర్టులిచ్చాం.. నిధులేవీ?
వర్సిటీలకు నిధులిస్తామన్నారు.. ప్రణాళికలు సమర్పించాలన్నారు.. రిపోర్టులిచ్చాం.. ఇంత వరకు నిధులే ఇవ్వలేదని పలువురు వీసీలు సమావేశంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. సీఎంతో సమావేశం కోసం ఒక రిపోర్టు, కమిటీ సమావేశం కోసం ఇంకో రిపోర్టు ఇచ్చాం. రూ. 35 కోట్లు ఇస్తామన్నారు. ఈ నిధులేవీ..? అంటూ ప్రశ్నించినట్టు తెలిసింది. గ్రాంట్లు రావు.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయి అంటూ ఆర్థిక సమస్యలు ప్రస్తావించారు. అన్ని వర్సిటీల్లో డిగ్రీ, పీజీ కోర్సులకు కామన్ సిలబస్ అమలుచేయాలని సమావేశంలో నిర్ణయించారు. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే కొత్త సిలబస్ ఖరారు చేయాలని మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి వీసీలను కోరారు. యూనివర్సిటీల పరిధిలోని కాలేజీల్లో అకాడమిక్ ఆడిట్‌ను చేపట్టాలని, 25%లోపు అడ్మిషన్లు ఉన్న కాలేజీలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని, జీరో అడ్మిషన్లకు అనుమతులిచ్చే అంశంపై సమీక్షించాలన్న అభిప్రాయాలు వచ్చాయి.
‘అటానమస్’ ఆగడాలు..
రాష్ట్రంలోని అటానమస్ కాలేజీల ఆగడాలను ఎవరు అరికట్టాలని సమావేశంలో పాల్గొన్న ఓ వీసీ గట్టిగా ప్రశ్నించినట్టు తెలిసింది. అటానమస్ కాలేజీలంతా బోగస్ అంటూ ఆయా వీసీ ఘాటు వ్యాఖ్యలు చేశారట. ‘ఇంజినీరింగ్ కాలేజీలు ఫేక్ .. ఫ్యాకల్టీ ఫేక్.. అటెండెన్స్ ఫేక్.. మార్కులు ఫేక్.. పర్సంటేజీలు ఫేక్..! అంటూ విరుచుకు పడగా, ఒక్కసారిగా సమావేశ వాతావరణం వేడెక్కినట్టు సమాచారం. ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్లు ఎస్కే మహమూద్, ఇటికాల పురుషోత్తం, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, సహా పలు వర్సిటీల వీసీలు సమావేశంలో పాల్గొన్నారు.