Free Education | హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : విద్యాహక్కు చట్టం 12(1)సీ ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు 25% సీట్లను ఉచితంగా ఇవ్వాల్సి ఉంది. ఈ 25% సీట్లను పేద, అణగారిన, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కేటాయించాలి. 2025-26 విద్యాసంవత్సరం గురువారం నుంచి ప్రారంభంకానున్నది. అయినా సర్కారు, విద్యాశాఖ దీనిపై ఏదీ తేల్చలేదు. దీంతో రాష్ట్రంలో ఇది అమలు కావడంలేదు. దీనిపై కొందరు హైకోర్టులో కేసు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం 12(1)సీ అమలుచేస్తామని కోర్టుకు తెలిపింది. స్కూళ్ల యాజమాన్యాలు 25% సీట్లను అమలుచేయబోమంటున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, బెస్ట్ అవైబుల్ స్కూళ్లకు వేలాది కోట్ల బకాయిలున్న నేపథ్యంలో తాము ఈ పథకాన్ని అమలుచేయబోమని భీష్మిస్తున్నాయి. తమను తప్పించాలని, సర్కారు చెల్లించే ఫీజులను విద్యార్థి తల్లిదండ్రుల ఖాతాల్లో వేసుకోవాలంటూ సూచిస్తున్నాయి. దీంతో పీఠముడి నెలకొన్నది.
యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం(యూడైస్) వివరాల ప్రకారం రాష్ట్రంలో ఒకటో తరగతిలో 3,61,244 సీట్లున్నాయి. వీటిలో 25% అంటే 90,311 సీట్లను ఆర్టీఈ 12(1)సీ సెక్షన్ ప్రకారం భర్తీచేయాలి. ప్రస్తుతం ఒకటో తరగతిలోనే సీట్లు కేటాయిస్తారు. ఆ తర్వాత క్రమంగా విస్తరిస్తారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 36కోట్ల భారం పడుతుందని అంచనా వేశారు. ప్రైవేట్ స్కూళ్లల్లో 25% సీట్లను సమర్ధవంతంగా, సజావుగా అమలుచేసేందుకు రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని విద్యాకమిషన్ సిఫారసు చేసింది. పట్టణ, గ్రామీణ, గిరిజన ప్రాంతీయ వ్యత్యాసాల ఆధారంగా ఖర్చును నిర్ణయించాలని సూచించింది. మరికొన్ని సిఫారసులు చేసింది. ఈ సిఫారసుల్లో సర్కారు వేటిని ఆమోదించింది.. వేటిని పక్కనపెట్టింది అన్నది సస్పెన్స్‌గా మారింది.
విద్యాహక్కు చట్టం సెక్షన్ 12 (1)సీని జాతీయంగా 20 రాష్ర్టాలు అమలుచేస్తున్నాయి. ఏపీ, తమిళనాడు, ఢిల్లీ సహా అనేక రాష్ర్టాల్లో ప్రైవేట్ స్కూళ్లల్లో 25% సీట్లను పేద విద్యార్థులకు ఉచితంగా కేటాయిస్తున్నాయి. ఈ సెక్షన్‌ను తెలంగాణ, పంజాబ్, కేరళ, పశ్చిమబెంగాల్ వంటి రాష్ర్టాలు మాత్రమే అమలుచేయడం లేదు. 2024 ఆగస్టులో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజ్యసభలో మాట్లాడుతూ.. తెలంగాణ, పంజాబ్, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ర్టాలు ఈ పథకాన్ని అమలుచేయాలని కోరారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నది.