వికారాబాద్ ఫిబ్రవరి 28 : రాష్ట్రంలోని గ్రామాల సమగ్ర అభివృద్ధికి పల్లె ప్రగతి కింద 2019 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు 8,629 కోట్ల రూపాయలు గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్ గా విడుదల చేశామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో రూ.5.15 కోట్ల వ్యయంతో నిర్మించనున్న జిల్లా ప్రజా పరిషత్ నూతన భవన నిర్మాణ పనులకు విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి తో కలసి శంకుస్థాపన చేసారు.
ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ.. కరోనా కాలంలో సంక్షేమానికి ఇతర రాష్ట్రాలు నిధులు ఆపాయి. కానీ, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రతినెలా క్రమం తప్పకుండా పెన్షన్లు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా రూ.1300 వందల కోట్లు నిధులను వికారాబాద్ జిల్లాకు కేటాయించి జిల్లాలోని అన్ని అవాసాలకు సురక్షితమైన తాగునీటి సదుపాయం కల్పించామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ. ముఖ్యమంత్రిగా కేసీఆర్ లేకపోతే కొన్ని మైలు రాళ్లు రాష్ట్రం అందుకోక పోతుండేదన్నారు. తెలంగాణ సాధన ఆయనతోనే సాధ్యం అయిందన్నారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలే యాదయ్య, నరేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, కలెక్టర్ నిఖిల, రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్, బీసీ కమిషన్ సభ్యుడులు శుభప్రద్ పటేల్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.