హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీలో రాజ్యం చేస్తున్న వెల్ఫేర్ కమిటీలను తక్షణం రద్దు చేయాలని, కార్మికుల చిరకాల డిమాండ్ అయిన విలీనాన్ని వెంటనే చేపట్టాలని ఆర్టీసీ కార్మిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆర్టీసీ కార్మిక సంఘాలన్నీ ఎన్నికలు వద్దని, విలీనం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయని, కానీ కార్మికులు, సంఘాల తీర్మానాలను పక్కనపెట్టి.. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తామని సర్కార్ చెప్పడం తమను గందరగోళంలోకి నెట్టడమేనని అన్నారు. ఎన్నికలు నిర్వహించడం వల్ల ఆర్టీసీకి, కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఎలాంటి ఉపయోగం లేదని తెలిపారు. విలీనంతోపాటు వెల్ఫేర్ కమిటీలను రద్దు చేసినప్పుడే కార్మికులు సంతోషంగా ఉంటారని చెప్పారు.